close
Choose your channels

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య.. నిందితుల ఎన్‌కౌంటర్?

Thursday, October 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహబూబాబాద్‌కు చెందిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజుల పాటు బాలుడి తల్లిదండ్రులకు, పోలీసులకు చుక్కలు చూపించారు. రూ.45 లక్షలు కావాలంటూ బాలుడి తల్లికి ఫోన్ చేసి వేధించారు. తన కుమారుడే ముఖ్యమని డబ్బు ఇస్తామని బాబుని ఏమీ చేయవద్దని కిడ్నాపర్లను తల్లి వేడుకుంది. అయినా కూడా కనికరించలేదు. డబ్బు తీసుకుని ఓ ప్లేస్‌కు రమ్మని చెప్పడంతో ఆ తల్లి తన పుస్తెలతో సహా అమ్మి భర్తకు డబ్బిచ్చి పంపించింది. డబ్బుతో బాలుడి తండ్రి నైట్ అంతా కిడ్నాపర్లు చెప్పిన చోట జాగారం చేశాడు. అయినా కిడ్నాపర్లు రాలేదు. ఐటీ కోర్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినా కేసులో పురగోతి కనిపించలేదు.

ఇంటర్ నెట్ కాల్స్ కావడంతో పోలీసులు సైతం ట్రేస్ అవుట్ చేయలేకపోయారు. చివరకు మహబూబాద్‌ శివారు గుట్టలో దీక్షిత్‌ మృతదేహం లభ్యమైంది. దీక్షిత్‌ మృతదేహాన్ని దహనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అంతు లేకుండా పోయింది. కానీ పోలీసులు మాత్రం ఆ నిందితులను విడిచిపెట్టలేదు. చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన దుండగులను ఎన్‌కౌంటర్ చేశారు. బాలుడి కిడ్నాప్, హత్యోదంతంలో ప్రధాన సూత్రధారులు సొంత బాబాయి, మేనమామే అని పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

నలుగురు నిందితులనూ అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. బాలుడిని కిడ్నాప్ చేసిన రెండు గంటలకే హత్య చేసినట్టు తెలిసింది. హత్య చేసిన తరువాత నుంచి డబ్బుల డ్రామా మొదలు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. సీన్ రీకనస్ట్రక్షన్‌లో భాగంగా నిందితులను కొండపైకి తీసుకెళ్లిన సమయంలో తప్పించుకోబోగా నిందితులు ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టు సమచారం. మరికాసేపట్లో ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని వివరాలూ తెలుస్తాయి.

మహబూబాబాద్‌లోని కృష్ణా కాలనీలో నివాసముంటున్న రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9) ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కిడ్నాప్‌నకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తీసుకెళ్లాడు. రాత్రైనా రాకపోవడంతో దీక్షిత్ కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి తీసుకెళ్లినట్టు అతని స్నేహితులు తెలిపారు. రాత్రి 9:45 గంటలకు కిడ్నాపర్లు వసంతకు ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని బెదిరించారు. అప్పటి నుంచి కిడ్నాప్ డ్రామాను కొనసాగించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.