Medaram:వనదేవతల మహాజాతర.. తెలంగాణ కుంభమేళాకు ముస్తాబైన మేడారం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు ఘడియలు సమీపించాయి. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే సమక్క-సారలమ్మ జాతర కోసం మేడారం ముస్తాబైంది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మాఘ శుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు సైతం తరలివస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో.. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు.
మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యాంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలుకొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఈ జాతరను చూసి మొక్కులు చెల్లించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు.
దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం 'మై మేడారం యాప్'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో కల్పిస్తున్న మౌలిక వసతులు, ముఖ్య ఘట్టాల సమాచారాన్ని ఇందులో అందుబాటులో ఉంచారు. ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ మేడారం సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు. అలాగే 'టీఎస్‌ఆర్టీసీ మేడారం జాతర', 'మేడారం పోలీస్ 2024' యాప్‌లను సైతం అందుబాటులో ఉంచారు. వీటిలో జాతరకు సంబంధించిన విషయాలు, తాగునీటి పాయింట్లు, బోర్లు, కుళాయిలు, మరుగుదొడ్లు, పార్కింగ్, సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, ఆర్టీసీ బస్సు సర్వీసులకు సంబంధించిన సమాచారం పొందుపరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments