close
Choose your channels

విపత్కర తరుణంలో రాజకీయాలొద్దు..: జనసేనాని

Thursday, April 9, 2020 • తెలుగు Comments

విపత్కర తరుణంలో రాజకీయాలొద్దు..: జనసేనాని

కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయిందని.. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు మన పార్టీపరంగా అండగా నిలుద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై పవన్ చర్చించారు.

సభ్యులు ఏమన్నారంటే..

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను తెలియచేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవాకార్యక్రమాలను పవన్‌కు తెలిపారు. చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థికపరమైన ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు.

రాజకీయాలొద్దు..

ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ సభ్యులు, విపక్షాలకు పలు సలహాలు, సూచనలు చేశారు. ‘లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే అంశంపై ఒక ప్రణాళిక అనుసరిద్దాం. గౌరవనీయులైన ప్రధాన మంత్రి సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది.. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయించడంపై పీఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అలాగే వైద్యులకు మాస్కులు, పి.పి.ఈ.లు తగిన విధంగా సమకూర్చని సమస్యపైనా స్పందించాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడంపై తోట చంద్రశేఖర్ సూచనలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా, సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నాయకులు, జనసైనికులు ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నారు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

రిస్క్ అయినప్పటికీ..

ఈ సందర్భంగా పీఏసీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇది చాలా క్లిష్టమైన సమయమని పేద ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు ఇస్తూ జనసేన కార్యకర్తలు అభినందనీయమైన సేవలు చేస్తున్నారన్నారు. రిస్క్‌తో కూడుకున్న సమయం అయినప్పటికీ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు.. వీటిని మరింత పకడ్బందీగా చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz