close
Choose your channels

సర్ధార్ పటేల్ తర్వాత అంత బలమైన అమిత్ షా : పవన్

Saturday, March 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సర్ధార్ పటేల్ తర్వాత అంత బలమైన అమిత్ షా : పవన్

తెలుగుదేశం పార్టీ మనల్ని ఒక విధంగా భయపెడితే... వైసీపీ మనల్ని మరోలా భయపెట్టాలని చూస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. లొంగిపోయి ఉనికి కోల్పోతామో... గుండె ధైర్యంతో నిలబడి సత్తా చాటడమో యువతే నిర్ణయించుకోవాలని అన్నారు. క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకుంటే వైసీపీకి మద్దతు ఇవ్వండని.. సమ సమాజం నిర్మిద్దామనుకుంటే జనసేనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ధైర్యం, తెగింపు ఉండాలని, లేనివారు జనసేనలోకి రావొద్దని అన్నారు. రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

పిడుగు మీద పడ్డా.. ఫిరంగు వదిలినా..!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘సమాజానికి పిరికితనం ఆవహించింది. దానిని తొలగించి, ధైర్యం నూరిపోయడానికే జనసేన పార్టీ పెట్టాను. పార్టీ ప్రారంభించే నాటికి ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతుంటే, దాడులు చేస్తారనే భయంతో ఒక్క నాయకుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయారు. ఒక్కొక్కరికి వేలకోట్లు, వేల ఎకరాలు ఉన్నా వారిలో ధైర్యం చచ్చిపోయింది. ధైర్యంగా ఒక్కడైనా మాట్లాడాలని ఆ రోజు పార్టీ పెట్టాను. అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు భయపడి కొంతమంది నాయకులు పారిపోతున్నారు. అలాంటి వారిని పెట్టుకొని పార్టీ నిర్మాణం చేయలేను. పిడుగు మీద పడ్డ, ఫిరంగు వదిలినా బెదరకుండా నిలబడే వ్యక్తులే పార్టీకి కావాలి. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్నాను. రాజమండ్రిలో కవాతు చేస్తే దాదాపు 10 లక్షల మంది వరకు వచ్చారు. ఓటు మాత్రం ఎవరైతే రౌడీయిజం చేస్తారో, క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తారో వారికి వేశారు. మహాత్ముడిని పూజిస్తాం... నేతాజీని గౌరవిస్తాం... అంబేద్కర్ ను గుండెల్లో పెట్టుకుంటాం... కానీ ఎన్నుకున్నది మాత్రం నేరచరిత్ర ఉన్న వ్యక్తులని. ఇదేమి లాజిక్కో నాకు అర్ధం కాదు. ఓటమి ఎదురైనా ఎక్కడో ఒక దగ్గర మార్పు రావాలని బలంగా నిలబడ్డాను. ఏడు సంవత్సరాలు కాదు ఏడు దశాబ్దాలు అయినా జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది’ అని పవన్ చెప్పుకొచ్చారు.

జనసేన ఉనికి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు

‘భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా గారు. అలాంటి వ్యక్తి వచ్చి భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయమని కోరినా కాదన్నాను. రాష్ట్ర ప్రయోజనాలకు జనసేన పార్టీ అవసరం ఉందని గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నాను. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేనట్లే. పార్టీ ఉనికిని ఎప్పుడూ కాపాడుతాను. అధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోము. ఏదో ఒక రోజు జనసేన అనే మొక్క మహావృక్షమై తీరుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో విభేదించాను తప్ప... నా స్వార్ధం కోసం ఏనాడు విభేదించలేదు. రాజకీయాలు అంటే జనసేన పార్టీకి నేషనల్ సర్వీసు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయి. కానీ జనసేన మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీనికి కారణం దేశాన్ని పటిష్టం చేయాలన్న, దేశసమగ్రతను కాపాడాలన్న అది బీజేపీతోనే సాధ్యం. ముఖ్యంగా బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. మిగతా పార్టీలన్ని వారసత్వ పార్టీలే. ఇవాళ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మాదిరి భవిష్యత్తులో ఆ పార్టీలో ఇంకా బలమైన నాయకులు వస్తారు. కర్ణాటకలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక జర్నలిస్టునీ, న్యాయవాదినీ ఎంపీలుగా చేసింది. దేశానికి ఇలాంటి పార్టీ అవసరమని పార్టీ నాయకులతో ముఖ్యంగా ముస్లిం నాయకులతో చర్చించి పొత్తు పెట్టుకున్నాం’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.