close
Choose your channels

రోజా టైమ్స్ స్టార్ట్.. చంద్రబాబుపై రివెంజ్ మామూలుగా లేదుగా!?

Friday, June 14, 2019 • తెలుగు Comments

రోజా టైమ్స్ స్టార్ట్.. చంద్రబాబుపై రివెంజ్ మామూలుగా లేదుగా!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. శాసనసభ స్పీకర్ ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనంతరం అటు టీడీపీ.. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఇక నగరి ఎమ్మెల్యే రోజా టైమ్ స్టార్ట్ అయ్యిందన్నట్లుగా.. చంద్రబాబును ఒక ఆట ఆడుకున్నారు. గతంలో రోజాను పట్టుబట్టి మరీ అసెంబ్లీ నుంచి బయటికి పంపడంతో ఆ పగ మొత్తం ఒక్కరోజులో తీర్చుకున్నారు.

రాద్ధాంతం ఎందుకు!?

అసెంబ్లీలో వాడివేడిగా జరుగుతున్న టైమ్‌లో రోజా మాట్లాడేందుకు ప్రయత్నించగా రెండుసార్లు రోజాకు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. అనంతరం తన సీటులో నుంచి రోజా.. ప్రారంభంలోనే చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు విసిరారు. ఎన్నిరోజుల్నుంచో పగతో ఉన్న రోజా ఇక నాకు టైమొచ్చింది.. నేనేంటో చూపిస్తానంటూ దుమ్ముదులిపి వదిలారు. సభా సంప్రదాయాలు, విలువలు గురించి ప్రతిపక్ష నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించేవిధంగా ఉందన్నారు. మంచి, చెడు గురించి మాట్లాడుకునేటప్పుడు ఉదాహరణలుగా గతాన్ని తీసుకుంటాం.. వాటిపై ఈ సభలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్నారని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. 

లెంపకాయలేసుకున్నా సరిపోదు!

"స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌ అయినప్పుడు ఆయనను అవమానించారు. అదేవిధంగా నేడు తమ్మినేని సీతారాం స్పీకర్‌ అయినప్పుడు అగౌరవపర్చడం చాలా బాధాకరం. ఎమ్మెల్యే చెవిరెడ్డి  క్షమాపణ  చెప్పాలని ప్రతి పక్ష నాయకులు కోరుతున్నారు సరే.. గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన మాటలకు లెంపకాయలు వేసుకున్న సరిపోదు. గొప్పగా ఫొటోలు పెట్టుకుని వర్ధంతులకు, జయంతులకు ఎన్టీఆర్‌ గురించి గొప్పగా మాట్లాడటం అంతే.. ఆయన స్థాపించిన పార్టీని లాక్కుని, ఆయనకు వెన్నుపోటు పోడిచి.. శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యనమల రామకృష్ణున్ని ఉపయోగించుకుని.. సభాపతి స్థానాన్ని ఎలా భ్రష్టుపట్టించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు" అని బాబుపై రోజా సెటైర్ల వర్షం కురిపించారు.

మార్షల్స్‌తో గెంటించారు గుర్తుంది!

"గత అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళలను వ్యభిచార కూపంలో దింపుతుంటే.. వాయిదా తీర్మానం ఇచ్చిన నా నోరు నొక్కడానికి సంవత్సరం పాటు సస్పెండ్‌ చేయడం న్యాయమా..?. సుప్రీంకోర్టుకు వెళ్ళి  గెలిచి ఎంట్రి ఆర్డర్‌తో వస్తే కనీసం న్యాయస్థానాన్ని కూడా గౌరవించకుండా నన్ను మార్షల్స్‌ చేత బయటకు గెట్టించిన విషయం నాకు గుర్తుంది. నేడు సభా సంప్రదాయాలు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే" అని రోజా చెప్పుకొచ్చారు. కాగా.. ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు ఈ సందర్భంగా రోజా అభినందనలు తెలియజేశారు. అత్యుత్తమ స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేనికి ఈ అవకాశాన్ని కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz