close
Choose your channels

ఏపీ అసెంబ్లీలో ‘బోయపాటి’ ప్రస్తావన.. రోజా ఎందుకు మాట్లాడినట్లు!?

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ అసెంబ్లీలో ‘బోయపాటి’ ప్రస్తావన.. రోజా ఎందుకు మాట్లాడినట్లు!?

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇటు ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు పారేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే రోజా ఓ రేంజ్‌లో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికితే పరిస్థితి ఎలా ఉంటుందో.. అసెంబ్లీలో రోజా పరిస్థితి కూడా లేక లేక అవకాశం రావడంతో అలా ఉందని విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్నారు. ఇంతకీ చంద్రబాబుపై రోజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి..? రోజా ఎందుకు ఈ రేంజ్‌లో డోస్ పెంచేసి మాట్లాడుతున్నారు..? బోయపాటి ప్రస్తావన ఎందుకొచ్చింది..? అనే వ్యాఖ్యలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అన్నొచ్చాడు..!

గత చంద్రబాబు పాలనలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని.. బాల్య వివాహాల్లో నంబర్‌. 1 స్థానంలో ఉందని ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా గత ప్రభుత్వాలు చేశాయని చంద్రబాబు ఐదేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో రోజా విమర్శలు గుప్పించారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ప్రతి ఆడబిడ్డను కాపాడేందుకు మా జగన్‌ అన్న ఉన్నారని రాష్ట్రంలోని మహిళలంతా ‘అన్న వచ్చాడు.. మా పెద్దాయన కొడుకు వచ్చాడు’ అని సంతోషంగా ఉన్నారన్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. అంతేకాదు.. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళా రక్షణ కోసం మహిళా మంత్రే ఉన్నారని చెప్పుకొచ్చారు.

బోయపాటి ప్రస్తావన తెచ్చిన రోజా!

"గవర్నర్‌ ప్రసంగంలో ప్రతి మహిళా కాపురాలు చక్కదిద్దబడతాయి.. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని సంక్షేమ పథకాలు చూస్తేనే అర్థమవుతోంది. 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఏ విధంగా ఎగ్గొట్టారో ఏపీ ప్రజలు చూశారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని రూ. 2350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళలను నట్టేట ముంచింది గత చంద్రబాబు ప్రభుత్వ కాదా..?. రైతులకు రుణమాఫీ చేస్తామన్నది చంద్రబాబు... ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు.. బోయపాటి శ్రీనుతో యాడ్స్‌ చేయించి డ్వాక్రా రుణమాఫీ చేశామని అబద్ధపు ప్రకటలు ప్రజలపై రుద్ధారు. జగన్‌పై పోరాటం చేస్తామని సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసం?. రైతులనే కాకుండా డ్వాక్రా మహిళల రుణమాఫీ, వడ్డీలేని రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు చంద్రబాబు, ఆయన కోటరీ పొర్లుదండాలు పెట్టి క్షమాపణలు చెప్పాలి" అని రోజా చెప్పుకొచ్చారు.

అప్పుడు టార్చర్.. ఇప్పుడు టార్చ్ బేరర్ పాలన!

"టార్చర్‌ చంద్రబాబు పాలనకు.. టార్చ్‌బేరర్‌ వైయస్‌ జగన్‌ పాలనకు చాలా తేడా ఉంది. పాదయాత్రలో మహిళలు మద్యపానం తమ కుటుంబాల్లో పెట్టిన చిచ్చును జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆ కష్టాలు విని వారి కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతో దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. బెల్టుషాపులు వీధి వీధిన పెట్టి ఆడవారి మాన, ప్రాణాలతో ఆడుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి బాధ అనిపించలేదా..? బ్యాంకుల్లో అప్పుకూడా పుట్టని స్థితికి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతుంటే మీకు బాధ అనిపించలేదా?" అని టీడీపీ ఎమ్మెల్యేలను రోజా ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

అచ్చెన్న.. వన్ అండ్ ఓన్లీ!

అయితే రోజా ఈ రేంజ్‌లో మాట్లాడుతున్నా.. అటువైపు తెలుగు తమ్ముళ్లు కానీ.. టీడీపీ తరఫున గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే నుంచి సౌండ్ లేకపోవడం గమనార్హం. మరోవైపు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం నారా లోకేష్‌ గురించి మాట్లాడి ఓ ఆట ఆడుకున్నారు. అయితే అచ్చెన్నాయుడు ఒక్కరు మాత్రమే ఈ విమర్శలకు కాసింత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.. తప్ప మిగిలిన వారెవ్వరూ ఆ సాహసం చేయలేకపోయారు. అయితే రోజా వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతారా లేకుంటే మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.