close
Choose your channels

Chandu:పవిత్ర నన్ను పిలుస్తోంది అంటూ పోస్టింగ్‌లు.. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య...

Saturday, May 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మర్చిపోకముందే.. మరో సీరియల్ నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లోని మణికొండలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. పవిత్ర జయరాం మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు ఆత్మహత్యకి పాల్పడినట్లుఅ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

పవిత్ర, చందు కొంత కాలంగా లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని సమాచారం. అప్పటికే వివాహమై పిల్లలున్న చందు.. పవిత్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరేళ్లుగా వీరి మధ్య వివాహేతర సంబంధం ఉందట. దీంతో ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు కొన్ని రోజులుగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అయితే చందు ఆత్మహత్యకి ఇదే కారణమా? మరేదైనా ఇతర కారణాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు.

నిజంగానే పవిత్ర జయరాం, చందు మధ్య వివాహేతర సంబంధం ఉందా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? వ్యక్తిగత కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా చందు 2015లో శిల్ప అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భార్యతో గొడవలు ఉన్నాయని.. దీంతో ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు టాక్‌. ఈ క్రమంలోనే పవిత్రకి చందు దగ్గరయ్యారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇక చందు ప్రస్తుతం 'త్రినయని` సీరియల్‌తో పాటు `రాధమ్మ పెళ్లి`, `కార్తీక దీపం` సీరియల్స్‌లో నటిస్తున్నారు.

మరోవైపు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమది ప్రేమ వివాహం అని దాదాపు 11ఏళ్లు ప్రేమించి పెళ్లిచేసుకున్నామని చెప్పారు. పవిత్ర జయరాం తమ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని.. దీంతో అతను తనకు దూరంగా ఉంటున్నాడని వాపోయారు. పవిత్ర చనిపోయిన తర్వాత తన వద్దకు చందు వచ్చి చెప్పాడని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండు.. జరిగిందేదో జరిగింది, పిల్లల కోసం అయినా బతికి ఉండు అని చెప్పినట్లు వివరించారు. చనిపోయేంత పిరికివాడిని కాదు.. పిల్లలను చూసుకోవాలి కదా అని తనతో చెప్పాడని.. ఆ మాట చెప్పిన 24 గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పవిత్రకు సంబంధించి పోస్టులు షేర్ చేసినట్లు సమాచారం. ‘ఈ రోజు నా పవిత్ర పుట్టినరోజు.. ఆమె నన్ను పిలుస్తోంది’ అని పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి కారులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో పవిత్ర మరణించారు. ఈ ప్రమాదంలో చందుకు కూడా గాయాలయ్యాయి. ఆమె మరణంతో అప్పటినుంచి చందు ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదం నింపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.