close
Choose your channels

Janasena:గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో జనసేనకు స్వల్ప ఊరట

Wednesday, May 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన పార్టీకి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. దీనిపై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. జనసేన పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని ఈసీ స్పష్టం చేసింది. 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎంపీ అభ్యర్థులకు.. 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని కోర్టుకు నివేదించింది.

ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను ముగించింది. అయితే తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని జనసేన తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌ జాబితాలో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈసీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

కాగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫ్రీ సింబల్ నుంచి గాజు గ్లాస్ గుర్తును తొలగించాలని ఈసీకి రెండు వినతిపత్రం ఇచ్చామని.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పొత్తులో ఉన్న కారణంగా తాము పోటీ చేయని మిగిలిన చోట్ల గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది అని వివరించారు. అయితే దీనిపై ఈసీ వివరణతో విచారణను ముగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో నీలమ్మ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. అలాగే లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి.. అచ్చెనాయుడు పోటీ చేస్తున్న టెక్కలి.. గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో సైతం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఇవే కాకుండా ఆమదాలవలస, విశాఖ తూర్పు, విజయవాడ సెంట్రల్,విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు,తణుకు, మండపేట, రాజమండ్రి అర్బన్, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోనూ స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో గాజు గ్లాస్ గుర్తుతో కూటమి పార్టీల ఓట్లు చీల్చేందుకు అధికారులతో వైసీపీ కుట్ర చేసిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.