close
Choose your channels

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం.. ఈసీ వెబ్‌సైట్‌లో వివరాలు..

Friday, March 15, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం.. ఈసీ వెబ్‌సైట్‌లో వివరాలు..

ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)వ్యవహారంలో SBIపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఎన్నికల బాండ్లపై ఈసీ దాఖలు పిటిషన్‌పై సీజేఐ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను ఎస్‌బీఐ తమకు సమర్పించలేదని ఈసీ తెలిపింది. దీంతో బాండ్ల నంబర్లు లేకపోవడంతో ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియడం లేదని.. అన్ని వివరాలను వెల్లడించాలని తాము ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదని ధర్మాసనం బ్యాంక్‌పై మండిపడింది. దీనిపై బ్యాంక్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే SBI సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నిలక సంఘం అధికారిక వెబ్‌సైట్లో బాండ్ల వివరాలను అప్‌లోడ్ చేసింది. న్యాయస్థానం విధించిన గడువుకు ఒకరోజు ముందే ఈ వివరాలను అప్‌లోడ్ చేసింది. మొత్తం రెండు జాబితాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి జాబితాలతో డినామినేషన్, తేదీలతో పాటు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలు ఉన్నాయి. మరో జాబితాలో రాజకీయ పార్టీల పేర్లతో పాటు బాండ్ల డినామినేషన్లు, ఎన్‌క్యాష్ చేసిన తేదీలు ఉన్నాయి. అయితే ఏ కంపెనీ లేదా వ్యక్తి నుంచి ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో అనే వివరాలు ఈసీకి బ్యాంక్ సమర్పించలేదు.

అత్యధికంగా బాండ్ల కొనుగోలు చేసిన కంపెనీల్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ ఉంది. ఈ సంస్థ ఏకంగా రూ.1,368 కోట్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసింది. అనతంరం తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి రెండో స్థానంలో ఉంది. రూ.410 కోట్లతో క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ మూడో స్థానంలో, వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు, హల్దియా ఎనర్జీ లిమిటెడ్ రూ.377 కోట్లతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి. రూ.247 కోట్లు విరాళంగా అందించిన భారతి గ్రూప్ 6వ స్థానంలో, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్, రూ.220 కోట్లు, కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్, రూ.195 కోట్లు, మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేసిన పార్టీలలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాదీ పార్టీ, ఏఐఏడీఎంకే, బీఆర్‌ఎస్, శివసేన, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా బీజేపీకి రూ.6,061కోట్లు, టీఎంసీకి రూ.1,610 కోట్లు, కాంగ్రెస్ కోసం రూ.1,422కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రూ.1,215కోట్ల విరాళాలు రాగా.. వైసీపీకి రూ.337కోట్లు, టీడీపీకి రూ.219కోట్ల విరాళాలు అందాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.