close
Choose your channels

చక్రం తిప్పుతున్న దగ్గుబాటి-విజయసాయి.. టీడీపీ నుంచి మరో ఇద్దరు ఔట్!

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చక్రం తిప్పుతున్న దగ్గుబాటి-విజయసాయి.. టీడీపీ నుంచి మరో ఇద్దరు ఔట్!

వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చక్రం తిప్పుతున్నారా..? వచ్చీ రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలను తనతో పాటు వైసీపీ గూటికి చేరుస్తున్నారా.? ఇప్పటికే ఒకరిద్దరు వైసీపీలో చేరడం వెనుక దగ్గుబాటి హస్తం ఉందా..? త్వరలోనే ఒకరిద్దరు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి.

"ఎన్నికలకు మూడ్నెళ్లు ముందుచ్చొమా.. రెండు నెలల ముందుచ్చొమా అనేది పాయింట్ కాదు.. వచ్చీ రాగానే మన సత్తా చూపించామా..? మనం చేరగానే నలుగుర్ని పార్టీలో చేర్చి.. పార్టీని బలోపేతం చేశామా లేదా అనేదే ముఖ్యం" అంటూ దగ్గుబాటి ఫ్యామిలీ దూసుకెళ్తోంది. జనవరి 27న అధికారికంగా దగ్గుబాటి కుటుంబం (పురందేశ్వరి మినహా) వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రకాశం రాజకీయాల్లో చక్రం తిప్పిన దగ్గుబాటి.. ఆయన వైసీపీలోకి రాగానే అప్పటి వరకూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయ్.. మళ్లీ పాతరోజులొచ్చేశాయ్ అంటూ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జిల్లాలో అసంతృప్తితో రగలిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలను వైసీపీ గైూటికి చేర్చే పనిలో దగ్గుబాటి బిజీబిజీగా గడుపుతున్నారు.

కాగా... ఆయన పేరు పైకి వినపడనప్పటికీ దగ్గుబాటి-విజయసాయిరెడ్డి కాంబినేషన్‌‌లో ఇప్పటికే టీడీపీకి చెందిన రెండు వికెట్లు డౌన్ అయ్యాయి. త్వరలో మరో వికెట్ పడనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చీరాల ఎమ్మెల్యే టీడీపీకి టాటా చెప్పి వైసీపీలో చేరడంలో దగ్గుబాటి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొదట తన గురువైన రోశయ్యను కలిసిన ఆమంచి కృష్ణమోహన్.. అనంతరం జిల్లాలో కీలక నేత అయిన దగ్గుపాటి సంప్రదించడం.. ఆయన వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిలతో మాట్లాడటం ఇవన్నీ కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయట. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ చేరికలో కూడా విజయసాయి, వైవీ, దగ్గుబాటి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

విజయవాడ ఎంపీని ఖరారు చేసిన దగ్గుబాటి..!

విజయవాడ లోక్‌సభ టికెట్ ఇప్పటికే ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు వైసీపీ ఫిక్స్ చేసేసింది. అయితే ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో అధిష్టానం ఒప్పుకోకపోవడం ఆ తర్వాత ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరడం జరిగిపోయింది. అయితే విజయవాడ వ్యవహారాన్ని కాస్త సీరియస్‌గా తీసుకున్న దగ్గుబాటి దాసరి విజయ్ ఎలక్ట్రికల్ అధినేత అయిన జై రమేశ్‌ను బరిలోకి దింపుదామని జగన్‌‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా..దాసరి ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో ప్రత్యర్థిని ఢీ కొనడం కష్టమేమీ కాదని ఆయన్ను దాదాపు ఫిక్స్ చేసేస్తారని సమాచారం. కాగా శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్‌‌తో దాసరి జై రమేశ్, దాసరి బాలవర్ధనరావు.. జగన్‌‌ను కలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ తరపున కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేయగా... ఆయనపై టీడీపీ తరపున బరిలోకి దిగిన కేశినేని నాని 70 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఈ సారి ఎలాగైనా సరే ఈ సీటు గెలిచి తీరాలని టార్గెట్‌‌గా పెట్టుకున్న వైసీపీ.. కేశినేని గట్టిగా ఢీకొనే అభ్యర్థినే రంగంలోకి దింపాలని యోచిస్తోంది.

టీడీపీకి టాటా చెప్పే యోచనలో మాగుంట

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి టాటా చెప్పేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఇదే జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి టీడీపీని వీడటంతో నష్టనివారణ చర్యలు చేపడుతున్న అధిష్టానానికి మాగుంట విషయం తెలుసుకుని కంగుతిన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి... తన అనుచరులతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. దీనికి ముందుగానే ఆయన పలు ప్రైవేట్ సంస్థల తరఫున సర్వేలు కూడా చేయించుకున్నారని సమాచారం. అంతేకాకంుడా మాగుంట అనుచరులు కొందరు ఆయనను వైసీపీ తరపున ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతుంటే... మరికొందరు మాత్రం టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తున్నట్టు సమాచారం. దగ్గుబాటితో మాట్లాడి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే ఒక్క ప్రకాశం జిల్లానే కాదు.. విజయవాడ, నెల్లూరులోనూ దగ్గుబాటి చక్రం తిప్పుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్న దగ్గుబాటి కుటుంబం... ఈ క్రమంలోనే కీలక నియోజకవర్గాల్లో సీఎంకు చెక్ పెట్టే దిశగా ముందుకెళ్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.