close
Choose your channels

జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత

Thursday, February 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొన్ని నెలల పాటు మహా నగర ప్రథమ పౌరురాలి ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు నేడు ముహూర్తం ఖరారు చేసింది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో నేడు కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం.. అనంతరం ఇక మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరిగింది. ముందుగానే టీఆర్ఎస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్‌ల పేర్లను ఖరారు చేసి.. వారి పేర్లను సీల్డ్ కవర్‌లో ఉంచింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి మేయర్ పదవి కోసం ఆశావహులు భారీగానే ఉన్నారు. కానీ అధిష్టానం టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసింది. విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ కూడా టీఆర్ఎస్‌ను బలపరచడంతో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి పేరును టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్.. దీనిని గాజుల రామారం కార్పొరేటర్ రావు శేషగిరిరావు బలపర్చారు.

కౌన్సిల్‌లో 149 మంది కార్పొరేటర్లు (ఒకరు మరణించారు), 44 మంది ఎక్స్‌అఫీషియోలతో కలిపి మొత్తం సభ్యులు 193 మంది ఉన్నారు. వీరిలో 97 మంది హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. వారిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతున్న వారు మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవుతారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియోలతో కలిపి ఎంఐఎం బలం-54 కాగా, బీజేపీకి 49 మంది సభ్యులున్నారు. టీఆర్‌ఎస్‌కు కార్పొరేటర్లు 56 మంది ఉన్నారు. కార్పొరేటర్ల మద్దతు(56)తోనే అధికార పక్షం మేయర్‌ పీఠం కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫీషియోలతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 70కి చేరుకుంది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు ఈ బలం సరిపోయింది. దీనికి తోడు ఎంఐఎం కూడా మద్దతుగా నిలవడంతో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

పీజేఆర్ కుమార్తె అలక..

మేయర్ అభ్యర్థిగా కాదు కదా.. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కూడా తన పేరును టీఆర్ఎస్ ప్రస్తావించకపోవడంతో జీహెచ్ఎంసీ నుంచి ఖైరతబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి వెళ్లిపోయారు. కార్పోరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరమే వడివడిగా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి వెళ్లిపోయారు. మేయర్ పదవి ఆశించి విజయారెడ్డి భంగపడ్డారు. గత ఎన్నికల్లోనూ మేయర్ పదవిని విజయారెడ్డి ఆశించారు. అప్పుడు కూడా ఆమెకు నిరాశే మిగిలింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆశించిన విజయారెడ్డికి నిరాశే ఎదురవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయా రెడ్డిని బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.