close
Choose your channels

Telangana Congress: చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

Tuesday, April 2, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

అతివృష్టి అనావృష్టి ఉండకూడదు అంటారు. ఏదైనా మోతాదుకు మించి ఉండకూడదని దీని అర్థం. ఇదే సామెత ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర నాయకులు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. 2014లో 63 సీట్లతో బొటాబొటి మెజార్టీ వచ్చినందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని జనం భావించారు.

చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

కేసీఆర్ నిర్ణయాలను స్వాగతించని ప్రజలు..

అందుకే 2018 ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో 88 సీట్లు కట్టబెట్టారు. అప్పుడు అవసరం లేకపోయినా సరే మళ్లీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకుని బలమైన శక్తిగా ఎదగాలని భావించారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీయాలనుకున్న కేసీఆర్‌కు అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ నాయకులు బలంగా పోరాడారు. ముఖ్యంగా ప్రస్తుతం సీఎం, అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద గట్టిగా తలపడ్డారు. అప్పటికే కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలతో రగిలిపోతున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.

చేరికలతో క్యాడర్‌లో అసహనం..

దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ కేవలం 64 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని చెబుతూ వచ్చారు. దాంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గేట్లు తెరిచారు. ఇక అంతే పోలోమని గులాబీ నేతలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నించిన నేతలు ఇప్పుడు పార్టీలో చేరడాన్ని హస్తం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

వలస నేతలతో అసలుకే మోసం..

కానీ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎక్కువ మంది వలస నేతలు పార్టీలో చేరితే అసలుకే మోసం వస్తుంది. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితే ఉదాహరణగా తీసుకోవచ్చు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని వారికి పదవులు ఇచ్చి అందలం ఎక్కించారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలను పక్కనపెట్టారు. అయితే అధికారం కోల్పోగానే వలస నేతలందరూ వెళ్లిపోతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే వీరంతా పార్టీలోనే ఉంటారనే గ్యారంటీ లేదు. అందుకే పార్టీనే నమ్ముకున్న నేతలను చేరదీరాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

తెలుగుదేశం పార్టీనే ఉదాహరణ..

ఇందుకు తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎంతో మంది కీలక నేతలు పార్టీ వదిలి వెళ్లిపోయారు. అయితే కిందస్థాయి క్యాడర్ బలంగా ఉండటంతో ఆ పార్టీ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని గట్టిగా నిలబడింది. అందుకే ఇతర పార్టీల నేతల కంటే సొంతంగా నేతలను తయారుచేసుకోవాలని పేర్కొంటున్నారు. అలాంటి నేతలే అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారని.. తద్వారా పార్టీ పునాదులు బలంగా ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని నమ్ముకున్న నేతలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు వచ్చే నేతలను నమ్ముకుని రాజకీయాలు చేస్తే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుకాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.