Poonam Kaur : నేనూ మీ బిడ్డనే.. నన్ను వెలి వేయకండి.. రాజ్‌భవన్ సాక్షిగా పూనమ్ కౌర్ కంటతడి


Send us your feedback to audioarticles@vaarta.com


వివక్ష.. ఇది అన్ని రంగాల్లో వినిపించే మాటే. కులం, మతం, ప్రాంతం, రంగు, రూపం ఇలా అన్నింట్లో పురుషులు, స్త్రీలు సమానంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. సినీ పరిశ్రమలోనూ ఇది విస్తృతంగా వేళ్లూనుకుపోయింది . ఇక్కడ ప్రాంతం , కులం విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. అన్ని ప్రాంతాల వారిని ఇక్కడ సమానంగా ఆదిరిస్తారు. ఎటోచ్చి కులానికి మాత్రం ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ. టాలీవుడ్‌లోని అన్ని విభాగాలు ఒక సామాజిక వర్గం కంట్రోల్లోనే వున్నాయన్న మాట అందరూ అంగీకరించే వాస్తవం. స్టూడియోలు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లలో ఆ కులానిదే ఆధిపత్యం.
నన్ను వెలివేయొద్దు:
ఈ సంగతి పక్కనబెడితే.. టాలీవుడ్లో ప్రాంతీయ వివక్ష వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరోయిన్ పూనమ్ కౌర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తాను పంజాబీనని, సిక్కునని చెప్పి.. ప్రాంతం పేరిట, మతం పేరిట తనను తెలంగాణ నుంచి వేరుచేద్దామని చూస్తున్నారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దయ చేసి మతం పేరు చెప్పి తనను వెలివేయొద్దని.. తాను తెలంగాణ బిడ్డనేనని , తాను ఇక్కడే పుట్టానని పూనమ్ కౌర్ స్పష్టం చేశారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్:
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ‘‘Fibromyalgia’’ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్లు ప్రకటించి పూనమ్ కౌర్ సంచలనం రేపారు. అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన కండరాల నొప్పి ఈ వ్యాధి లక్షణాలు. ప్రస్తుతం కేరళలో వున్న పూనంకౌర్‌కు అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ప్రస్తుతం Fibromyalgia నుంచి కోలుకునేందుకు పూనమ్ కౌర్ శ్రమిస్తున్నారు. వ్యాయామాలు, టాకింగ్ థెరపీలే దీనికి మందులుగా వైద్యులు చెబుతున్నారు.
జీవితాంతం వ్యాధితో పోరాటమే :
కొద్దిరోజుల క్రితం IndiaGlitzతో పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి జీవితాంతం వుంటుందని తెలిపారు. తాను పూణేకి తిరిగి వచ్చానని, రెండేళ్లుగా తనను విపరీతంగా ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం వున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.