close
Choose your channels

AP High Court: ఆన్‌లైన్ సినిమా టికెట్లు... జగన్ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు, వివాదం మళ్లీ మొదటికేనా..?

Tuesday, June 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజలకు వినోదం అందుబాటులో వుండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో థియేటర్ల వద్ద టికెట్ల విక్రయాలు కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగేలా ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేసింది. అయితే దీనిపై పలు వివాదాలు చుట్టుముట్టినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆన్‌లైన్ టికెట్‌ విక్రయాల వ్యవహారం మరోసారి ఏపీ హైకోర్టుకు చేరింది.

ఈ నెల 27న కోర్టు స్పందనపై ఉత్కంఠ:

సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు ఏపీ గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం.. ఆ తర్వాత ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్‌ట్రీ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటూ డిప్యూటీ జనరల్‌ మేనేజర్ సందీప్‌ అన్నోజ్‌వాలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసనసభ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్టేట్‌, ఫిల్మ్‌, టెలివిజన్‌, ఏపీఎస్‌ఎఫ్‌టివీటిడీసీ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌‌లకు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

రూ.2లో ప్రభుత్వానికే రూ.1.97 .. మరి మా గతేంటీ :

కాగా.. టికెట్‌ విక్రయాల ద్వారా సర్వీసు ఛార్జీ కింద వచ్చే రూ.2లో ప్రభుత్వానికి రూ.1.97 వెళుతుందని.. తమకు కేవలం మూడు పైసలు మాత్రమే వస్తుందని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో 80 శాతం ప్రభావితం అయ్యేది ఆన్‌లైన్‌ వేదికగా టికెట్లను విక్రయిస్తున్న సంస్థలేనని న్యాయవాది వాదించారు. ఈ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వానికి తగిన వేదిక లేదన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. గతంలో మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలు ఇదే వ్యవహారంపై వ్యాజ్యం దాఖలు చేశాయని.. ఆ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. దీంతో ఈ నెల 27న జరిగే విచారణలో కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.