Tahsildar: అర్థరాత్రి డిప్యూటీ కలెక్టర్ గది తలుపుకొట్టిన డిప్యూటీ తహసీల్దార్ .. ఉలిక్కిపడ్డ మహిళా అధికారిణీ


Send us your feedback to audioarticles@vaarta.com


ఇటీవల తెలంగాణ సీఎంవో కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ ప్రవేశించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అచ్చం ఇదే తరహా ఘటన ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ మహిళా డిప్యూటీ కలెక్టర్ గది తలుపులు కొట్టి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాకు చెందిన సతీష్ గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏపీ హెచ్ఆర్డీఐ శిక్షణ కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. అదే కేంద్రానికి మహిళా డిప్యూటీ కలెక్టర్ ఒకరు శిక్షణ నిమిత్తం వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సతీష్.. శిక్షణ పొందుతున్న అధికారులు బస చేస్తున్న వీకేఎన్‌కే అపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ వుండే గది తలుపులు కొట్టడంతో ఆమె భయాందోళనలకు గురైంది. వెంటనే 112కి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సతీష్‌ను అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా.. అక్రమంగా స్మిత ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్ అతని స్నేహితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి సస్పెన్షన్ ఆర్డర్‌ను మేడ్చల్ అధికారులు జైలులోనే ఆయనకు అందజేశారు.త
అసలేం జరిగిందంటే :
మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి గతవారం తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని తీసుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లాడు. భద్రతా సిబ్బందికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా క్వార్టర్స్‌లోకి వెళ్లాడు. అనంతరం స్మిత ఇంటి డోర్ తెరిచి లోనికి చొరబడ్డాడు.
గట్టిగా కేకలు వేసిన స్మితా సబర్వాల్:
అర్థరాత్రి సమయంలో తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి వుండటంతో స్మితా సబర్వాల్ నివ్వెరపోయారు. దీంతో ఆమె అతనిని ప్రశ్నించగా.. తన పేరు , వివరాలు చెప్పి గతంలో మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్మితా సబర్వాల్ వెంటనే బయటికి వెళ్లాల్సిందిగా కేకలు వేశారు. ఆమె అరుపులతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే డిప్యూటీ తహసీల్దార్‌ను, అతని స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అనుమానం వస్తే 100కి డయల్ చేయాలన్న స్మితా :
మరోవైపు ఈ భయంకరమైన ఘటనపై స్మితా సబర్వాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అపరిచిత వ్యక్తి తన ఇంట్లోకి చొరబడినప్పుడు తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టానని ఆమె తెలిపారు. గట్టిగా కేకలు వేయడంతో, భద్రతా సిబ్బంది వచ్చారని .. ఏ సమయంలోనైనా ధైర్యం కోల్పోకుండా వుండాలని ఆమె సూచించారు. ప్రమాదం ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదని, అందువల్ల ఎప్పుడూ ఇంటికి తలుపులు , తాళాలు వేసి వుంచాలని స్మితా సబర్వాల్ తెలిపారు. ఎలాంటి అనుమానం వచ్చినా 100కు డయల్ చేయాలని ఆమె సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.