close
Choose your channels

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

Tuesday, March 12, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

ఏపీ ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అధికార, విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమను కాదని వెళ్లిన నేతలపై అధికార వైసీపీ గుర్రుగా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయగా.. తాజాగా ఎమ్మెల్సీలను సైతం సస్పెండ్ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీకృష్ణ జనసేనలో చేరగా.. రామచంద్రయ్య టీడీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్, మండలి కార్యదర్శికి మండలి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు వారికి నోటీసులు పంపించారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నోటీసులపై స్పందించిన వంశీకృష్ణ, రామచంద్రయ్య వివరణ కూడా ఇచ్చారు. అయితే వాళ్ల వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

కాగా ఇటీవల పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై సభాపతి తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన విషయం విధితమే. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి మద్దతు తెలిపిన ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

ఈ క్రమంలోనే వైసీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన స్పీకర్‌ తమ్మినేని.. పలుమార్లు ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్లు విచారణలో తేలడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.