close
Choose your channels

రైతన్నలు చంద్రన్న వైపా.. జగనన్న వైపా..!?

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రైతన్నలు చంద్రన్న వైపా.. జగనన్న వైపా..!?

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు హద్దు అదుపు లేకుండా హామీలు ఇచ్చేస్తున్నాయి. నాలుగన్నరేళ్లకుపైగా ఏపీని పరిపాలించిన ఆంధ్రప్రదేశ్‌‌ అధికారంలో ఉన్న టీడీపీ.. 2014 ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చింది..? అందులో ఎన్ని అమలు చేసింది..? ఎన్ని పథకాలు ప్రవేశపెట్టింది..? ఏమేరకు జనాల్లోకి వెళ్లాయి..? అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరోసారి వాళ్లు.. వీళ్లు అని కాకుండా అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ, నిరుద్యోగులకు యువనేస్తం, కాపు రిజర్వేషన్, ఉద్యోగులకు జీతాలపెంపు ఇలా అన్ని వర్గాల వారిపై చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా ‘రైతన్నకు ప్రేమతో’ అంటూ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ. 15వేలు సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే బాబు మాటలు ఎంత వరకు రైతన్నలు నమ్ముతారు..? ఏ మేరకు ఓట్లేస్తారు..? అనేది దేవుడికెరుక.

ఇక వైసీపీ విషయానికొస్తే...

ఇప్పటికే వైఎస్సార్ ‘రైతు భరోసా’ ‘ఆరోగ్య శ్రీ’, ‘యువత-ఉపాధి’, ‘పింఛన్ల పెంపు’, ‘ఫీజు రీయంబర్స్‌మెంట్’, ‘పేదలందరికీ ఇల్లు’ ‘అమ్మ ఒడి’, ‘వైఎస్సార్ ఆసరా’, ‘వైఎస్సార్ చేయూత’, ‘జలయజ్ఞం’, ‘మద్యపాన నిషేధం’ అని నవరత్నాలు ప్రకటిస్తూ ఇప్పటికే జగన్ పార్టీ నేతలు జనాల్లో దూసుకెళ్తున్నారు.

ఇప్పటికే తమ పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలను టీడీపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని.. ‘కాపీ క్యాట్’లాగా చంద్రబాబు కాపీ కొట్టేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. రైతన్నపై చంద్రబాబు వరాలు కురిపించారు. అయితే మొదట వైసీపీ నవరత్నాల్లో రైతన్నలకు ఏం చెప్పింది..? చంద్రబాబు సర్కార్ ఏం చెప్పింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

వైఎస్సార్ రైతు భరోసా..

ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ. 50 వేలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలో రూ. 12,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు.. రెండవ సంవత్సరం నుంచి ఇస్తాం

పంట భీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే చెల్లిస్తాం

రైతన్నలకు వడ్డీలు లేని రుణాలస్తాం

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

వ్యవసాయానికి పగటి పూట 9గంటలు ఉచిత కరెంట్

ఆక్వారైతులకు కరెంటు చార్జీలు యూనిట్‌కు రూ. 1.50కు తగ్గింపు

రూ. 3 వేల కోట్లతో ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు

రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు

ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు మరియు అవసంర మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్దరిస్తాం.. రెండవ ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ. 4 సబ్సిడి

వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తాం

ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ. 5 లక్షలు ఇస్తాం. అంతే కాదు ఆ డబ్బును అప్పులవాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం

సంవత్సరానికి రూ. 12,500.. మొత్తం- లక్ష రూపాయిలు
(12,500+ ఉచిత విద్యుత్తు+0% వడ్డీ సొమ్ము+ ట్రాక్టర్ రోడ్ ట్యాక్స్)

రైతన్నకు చంద్రన్న ఇచ్చిన హామీ ఇదీ...

5 ఎకరాల లోపు రైతులకు 15వేలు సాయం

రైతు కోసం కేంద్రం ప్రకటించిన రూ. 6 వేలకు అదనంగా మరో రూ. 9వేలు కలిపి చిన్న, సన్నకారు రైతులకు మొత్తం రూ. 15వేలు అందిస్తాం.

ఎన్నికలకు ముందే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.4వేలు జమ చేస్తాం.

కాగా.. దేశం మొత్తం మీద 6 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని..ఇది ప్రపంచానికి మనం అందించే కానుక అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సో.. ఇదీ జగన్, చంద్రన్న లెక్కలు.. ఎవరేం ప్రకటించారు..? అనే విషయాలు కాస్త నిశితంగా పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. మరి రైతులు ఈ చంద్రన్న వరాలకు ఫిదా అవుతారా..? జగన్ వైఎస్సార్ భరోసాకు ఫిదా అవుతారా..? అస్సలు రైతులు జగన్ వైపా.. చంద్రన్న వైపా అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.