close
Choose your channels

నేను ఎవ్వరికీ భయపడను..లోకేష్‌ ఆయనతో జాగ్రత్త!

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను ఎవ్వరికీ భయపడను.. లోకేష్‌ ఆయనతో జాగ్రత్త!

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత స్పీడ్ పెంచారు. భీమిలిలో శనివారం నాడు పార్టీ కార్యాలయం ప్రారంభించిన అవంతి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి గంటాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు నైతిక విలువలు లేవని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి గంటా తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. స్వార్థ రాజకీయాలు కోసం పార్టీ మారలేదని ఆయన తేల్చిచెప్పారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మంత్రి గంటా.. నీతులు వల్లిస్తున్నారన్నారని దుమారం రేపే వ్యా్ఖ్యలు చేశారు. గంటా అవినీతి గురించి భీమిలి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అసలు ఆయన అనకాపల్లి వదిలి భీమిలీ ఎందుకు రావాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. 2014 ఎన్నికలప్పుడు తాను భీమిలి ఎమ్మెల్యే సీటు అడిగితే.. ఎంపీగా అనకాపల్లి ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలన్నారు. గంటా లాగా మోసం చేసే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణలో ఆస్తులు ఉన్నాయని.. అందుకు భయపడ్డానని తెలుగుదేశం నాయకులు చేసిన వ్యాఖ్యలను అవంతి తీవ్రంగా ఖండించారు.

ఎవ్వరికీ భయపడను..

"నేను ఎవరికి భయపడను. ప్రధాని మోదీకే భయపడలేదు. పార్లమెంటులో మోదీని మెట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తిని నేనే. స్వార్థ రాజకీయాలు కోసం పార్టీ మారానని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండటం ఓర్వలేక.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం స్వార్థం కాదా? మీరు చేస్తే నీతి.. వేరే వ్యక్తులు చేస్తే చెడ్డదా?. నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తానని ఎప్పుడూ చెప్పలేదని.. టీడీపీ అధిష్ఠానమే నన్ను పిలిచింది. నమ్మి పార్టీలోకి వెళ్ళితే నమ్మించి మోసం చేశారు" అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

లోకేశ్ జాగ్రత్త.. గంటా నీ పరిధిలో నువ్వుండు!

"లోకేష్‌.. గంటాతో జాగ్రత్తగా ఉండాలి. గంటా లక్ష్యం భీమిలి కాదని.. అమరావతి. చంద్రబాబులాగా పోరాటాలు చేయకుండా ముఖ్యమంత్రి అవ్వాలని గంటా లక్ష్యం. భీమిలి ప్రజానీకాన్ని గంటా ఒక పురుగులా చూస్తున్నారు. ఎక్కడ పోటీ చేసినా డబ్బులతో గెలవవచ్చు అని గంటా భావిస్తున్నారు. నేడు ఆ పరిస్థితి లేదు.. గంటా గురించి ప్రజలందరికి తెలుసు. దయ చేసిన నా జోలికి రావద్దు.. మీ పరిధిలో మీరు ఉండాలి. ఎవరు పని వారు చేసుకుంటే మంచిది. గంటా ఎథిక్స్‌ గురించి మాట్లాడలాంటే అందరికంటే బాగా అయ్యన్న పాత్రుడు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గంటా అనే పామును జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ముందుగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుమారు 8 నెలలు వేచి నాకోసం చూశారు. ఈ రోజు వచ్చినా నాకు జగన్ అవకాశం కల్పించారు. ఇచ్చిన మాట ఎన్ని సంవత్సరాలైనా నిలబెట్టుకునే వ్యక్తి వైఎస్‌ జగన్‌" అని అవంతీ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

కాగా.. పార్టీలో ఉన్నప్పుడే ఉప్పు-నిప్పులా ఉన్న గంటా-అవంతి ఇప్పుడు పార్టీ మారడంతో మరింత జోరు పెంచి మాటల యుద్ధం సాగిస్తున్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే.. మున్ముంథు పరిస్థితులు ముదురుతాయేమో. ఇదిలా ఉంటే ఇప్పటికే అయ్యన్న వర్సెస్ గంటా.. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అదికాస్త చినికి చినికి ఒకరిపై ఒకరు ‘సిట్’ వేయాలి అనేదాకా వెళ్లింది. అయితే తాజాగా గంటాకు మరో బద్ధ శత్రువు అవంతి రూపంలో వచ్చి పడ్డారు. ఈ ఇద్దర్నీ ఢీకొని 2019 ఎన్నికల్లో ఏ మాత్రం రాణిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.