close
Choose your channels

విజయ నిర్మల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Thursday, June 27, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ నిర్మల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

విజయనిర్మల మృతి పట్ల మంత్రి తలసాని తీవ్ర దిగ్భ్రాంతి

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. విజయ నిర్మల మరణంతో చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకురాలు, నటిని కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా.. విజయనిర్మల మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కాగా.. విజయనిర్మల ఇకలేరన్న వార్త విన్న ఘట్టమనేని అభిమానులు, సూపర్ స్టార్ మహేశ్ వీరాభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కాగా.. విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణ భార్య అన్న విషయం తెలిసిందే. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల.. అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 50 సినిమాల్లో జంటగా నటించారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా.. ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే.. 11 ఏళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ అనే సినిమాతో నటిగా వెండితెరకు ఆమె ఎంట్రీ ఇచ్చారు. ‘రంగుల రాట్నం’ చిత్రంతో హీరోయిన్‌గా విజయనిర్మలం పరిచయం అయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల నటి.. దర్శకురాలిగానే కాదు రాజకీయాల్లో సైతం రాణించాలని ఎంతగానో అనుకున్నారు. అయితే మొదటిసారే ఓటమితోనే రాజకీయాలు వద్దని.. ఇవన్నీ తనకు అచ్చిరావని దూరమై మళ్లీ సినిమాలకే అంకితమయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో విచిత్రం ఏంటో గానీ అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ ఓడిపోయి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ఎర్నేని రాజా రామచందర్ ఘన విజయం సాధించారు. ఎర్నేని చేతిలో కేవలం వెయ్యి ఓట్లకు పైగా తేడాతో విజయనిర్మల ఓటమి చెందారు.

ఓటమితో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆమె ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. అంతేకాదు.. ఇక రాజకీయాల్లోకి కాలు మోపకూడని భావించిన ఆమె.. ఆ ఓటమి దెబ్బతో రాజకీయాలు అచ్చిరావని భావించి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన జీవితంలో ఇదో మరిచిపోలేని ఘటన అని పలు ఇంటర్వ్యూల్లో విజయనిర్మల చెప్పుకొచ్చారు

విజ‌య‌నిర్మలకు సినిమా త‌ప్ప వేరే ప్రపంచం లేదు..!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు విజ‌య‌నిర్మల మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ప్రముఖ దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ ఆమెతో ఉన్న అనుబంధాన్ని.. ఆమె సేవల గురించి మాట్లాడారు. అత్యధిక చిత్రాలు ద‌ర్శక‌త్వం వ‌హించిన మ‌హిళా ద‌ర్శకురాలు విజ‌య‌నిర్మల ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని మ‌న‌స్పూర్తిగా కొరుకుంటున్నట్లు ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆనంద్ మాటల్లోనే...
"చిన్న వయ‌సు నుంచి మ‌నంద‌రం సినిమాలు చూసేవాళ్ళం కానీ.. శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారు సినిమాలు చేయ‌టం మెద‌లు పెట్టారు. విజ‌య‌నిర్మల గారికి సినిమా త‌ప్ప వేరే ప్రపంచం లేదు. మ‌హాన‌టిగా, గొప్ప ద‌ర్శకురాలుగా, ఉత్తమ నిర్మాత‌గా త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాల భాష‌ల్లో త‌న‌కంటూ ప్రత్యేఖ‌త చాటుకున్నారు. త‌న సిని కుటుంబాన్ని వ‌ద‌లి వెళ్ళిపోవ‌టం తెలుగు సినిమా అభిమానులంద‌ర‌కి తీవ్ర దిగ్బ్రాంతి క‌లిగించింది. శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి కుటుంబానికి ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, న‌రేష్ గారికి అలాగే వారి అభిమానుల‌కు నా తీవ్ర సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను" అని ఆనంద్ చెబుతూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు.

విజయనిర్మల లేరన్న వార్త బాధించింది : ఉషా మ‌ల్పూరి

మ‌హిళా ద‌ర్శకురాలుగా విజ‌యనిర్మలను చూసి ఎప్పుడూ గ‌ర్వప‌డేదాన్ని అని.. ఆమె లేర‌నే వార్త తన‌ను చాలా భాదించిందని నిర్మాత ఉషా మ‌ల్పూరి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తెల‌గు సినిమా చ‌రిత్రలో ఎంద‌రో ద‌ర్శకులు వారి వారి స‌త్తా చాటుకున్నారు.. కానీ మ‌హిళా ద‌ర్శకురాలుగా గిన్నిస్ బుక్ రికార్డుని సాధించిన ద‌ర్శకురాలు మాత్రం విజ‌య‌నిర్మలేనని ఉషా చెప్పుకొచ్చారు.

ఉషా మ‌ల్పూరి మాటల్లోనే..
"సూప‌ర్‌స్టార్ కృష్ణ గారిని, విజ‌య‌నిర్మల గారిని చూస్తే క‌డుపు నిండుపోయేది.. అంత అందంగా వుండేది వారి జంట‌. అంత అంద‌మైన న‌టి, నిర్మాత‌, ద‌ర్శకురాలు తిరిగిరాని లోకాల‌కి వెళ్ళిపోయింద‌నే వార్త న‌మ్మలేక‌పోయాను. శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారి కుటుంబ స‌భ్యులంద‌రికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, మా అధ్యక్షులు న‌రేష్ గారికి ఆ భ‌గ‌వంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కొరుకుంటున్నాను" అని నిర్మాత ఉషా మ‌ల్పూరి తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.