close
Choose your channels

Conductor Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీని షేక్ చేసిన లేడీ కండక్టర్.. కంటతడి పెట్టించిన లైఫ్‌ స్టోరీ

Monday, August 29, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతోమంది ప్రతిభావంతులను బుల్లితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అలా చాలా మంది ఈ షోలో తమ ప్రతిభను నిరూపించుకుని మంచి అవకాశాలను పొందుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా గాజువాక‌లోని ఏపీఎస్ఆర్టీసీ డిపోకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ. ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీలో తన డ్యాన్స్‌తో ఇరగదీసింది. చింపిరి జుట్టు దాన్ని.. చెవులు ఇరుసున చుట్టదాన్ని’’ అంటూ వేసిన ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఝాన్సీ స్టెప్పులకు ఊగిపోయిన స్టేజ్:

పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా.. డాన్స్ మీదున్న ఇష్టంతో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూనే తన ప్రతిభను చాటుకుంటున్నారు ఝాన్సీ. అలా టాలెంట్ ఎక్కడ వున్నా వెతికి పట్టుకుని మరి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ స్టేజ్‌పైకి తీసుకొస్తున్న మల్లెమాల సంస్థ ఝాన్సీకి కూడా అవకాశం కల్పించింది. ఆగస్ట్ 28న ప్రసారమైన ఎపిసోడ్‌లో కప్పలపెళ్లి అనే కాన్సెప్ట్‌లో ‘నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.. పల్సర్ బైక్ పైన రారా బావో’ అనే ఫోక్ సాంగ్‌కి ఝూన్సీ వేసిన స్టెప్పులకు అక్కుడున్న వారు కుర్చీలో కూర్చోలేకపోయారు. రష్మీ, వర్ష, ఆది, చలాకీ చంటీ, రాంప్రసాద్ వంటి వారు ఝాన్సీతో కలిసి స్టెప్పులు వేశారు.

సోషల్ మీడియా ముందే వచ్చుంటే:

డ్యాన్స్ ముగిశాక తన నేపథ్యం గురించి చెబుతూ.. తన పేరు ఝాన్సీ అని, గాజువాకలోని ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పడంతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. విశాఖ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ వరకు సాగిన ప్రయాణాన్ని ఝాన్సీ వివరించారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ప్రాణమని మా గురువుగారు రమేశ్ ఎన్నో మెళకువలు నేర్పించారని ఆమె తెలిపారు. కండక్టర్‌గా 11 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని.. అయినప్పటికీ డ్యాన్స్‌ని మాత్రం వదులుకోలేదని చెప్పారు. అయితే సోషల్ మీడియా లేకపోవడం వల్ల తన ప్రతిభ అందరికీ తెలియడానికి ఇంతకాలం పట్టిందని ఝూన్సీ పేర్కొన్నారు.

భర్త, అధికారుల తోడ్పాటుతోనే ఇక్కడిదాకా :

తనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నారని.. తన భర్త నూకరాజు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని చెప్పింది. ఓ వైపు డ్యాన్స్ షోలు, మరోవైపు ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేస్తున్నానంటే.. తన పైఅధికారులు, మిత్రుల ప్రోత్సాహమేనని ఝాన్సీ వెల్లడించారు. భవిష్యత్తులో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఝాన్సీ డ్యాన్స్‌షో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపుతుండటంతో ఆమెకు అవకాశాలు కూడా పోటెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో ఝాన్సీ సెలబ్రెటీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.