close
Choose your channels

TDP MP Candidate:గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు రూ.5,785 కోట్లు..!

Monday, April 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లు కూడా మొదలుకావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. మిగిలిన అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల వివరాలు తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

దేశంలో పెద్ద పెద్ద కార్పొరేటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం రాజకీయాలను కార్పొరేటర్లే శాసిస్తున్నారు చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రతి పార్టీలో బిజినెస్‌మెన్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అయితే వారెవరూ తమ వాస్తవ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించరు. అసలు ఆస్తులు కంటే తక్కువ ఆస్తులను చూపిస్తారు. కానీ అమెరికాలో సెటిల్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తన ఆస్తులను నిర్భయంగా ప్రకటించారు. ఇవాళ ఉదయం భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన పెమ్మసాని.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఇందులో తనతో పాటు తన కుటుంబానికి మొత్తం రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598.65 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.186.63 కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రూ.1,038కోట్లు అప్పులు ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆయన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎంతో ధైర్యంగా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నడం ఆయన నిజాయితీగా నిదర్శనమని కొనియాడుతున్నారు.

కాగా గుంటూరు జిల్లాలో పుట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంబీబీఎస్ వరకు ఇండియాలోనే చదివారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ అక్కడే మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడ్డారు. 'యూవరల్డ్' పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఆన్‌లైన్ ఎడ్యూటెక్ కంపెనీని నడుపుతున్నారు. దీంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో ఎన్నో వేల కోట్లు సంపాందించిన పెమ్మసాని.. తన జన్మభూమి కోసం సేవ చేయాలనే తపనతో ఏపీకి తిరిగి వచ్చి రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్.. దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా కూడా మాతృభాష తెలుగును మర్చిపోలేదు. స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. దేశ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల పట్ల పూర్తి అవగాహనతోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెడుతున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో వివరిస్తూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.