close
Choose your channels

KTR:సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని కోర్టుకు లాగుతాం.. కేటీఆర్ వార్నింగ్..

Friday, May 24, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని జైలులో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ‘‘నా బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్‌ కాంట్రాక్టు వచ్చిందని సీఎం ఆరోపించారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు కథ అల్లారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్టు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టరు?’’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

టీజీఎస్ ఆర్టీసీ లోగో ప్రచారంపై కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నవారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. డీజీపీ రవి గుప్తా, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సంస్థకి ఆయన ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు నమోదుచేయట్లేదని నిలదీశారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. నిజాల‌ను బట్ట‌బ‌య‌లు చేస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులు పెడుతున్నారని.. ఆర్టీసీ కొత్త లోగో అంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌డం లేద‌ని మండిపడ్డారు.

టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చిన నేపథ్యంలో సంస్థ లోగోను కూడా మార్చినట్లు సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీని పోలిన విధంగా ఆ లోగో ఉంది. అయితే లోగో మార్పుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని చెప్పారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో ఫేక్‌ అని తేల్చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని.. త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌ పేరును అధికారికంగా వాడేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్‌ పార్టీకి దగ్గరగా ఉంటుందని టీఎస్ పేరు గతంలో చేర్చారని సీఎం ఆరోపించారు. అందుకే అందరికి వాడుక భాషలో ఉండేలా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గ తీర్మానం పంపించింది. దీంతో ఇటీవలే కేంద్రం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అధికారులు తక్షణమే రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.