close
Choose your channels

Kejriwal:కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

Friday, March 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దేశంలో మొదటిసారి సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేజ్రీవాల్ అరెస్టును రాజకీయ కుట్ర అంటూ మండిపడుతోంది. అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు ఆప్ పిలుపునిచ్చిందిదీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఆప్, బీజేపీ కార్యాలయాలకు వెళ్లే రహదారులను మూసివేశారు.

ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ పోలీసుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అటు కేజ్రీవాల్ అరెస్టును ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయ సహాయం అందించడంపై కేజ్రీవాల్ కుటుంబానికి మద్దతు ఇవ్వనున్నాయి.

కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆప్ నేతలు ఆశ్రయించారు. ఈడీ అరెస్టును అడ్డుకోలేమంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టనుంది. మరోవైపు కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని అడగనున్నారు. ఈ మేరకు ఆయనకు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే సీఎంగా తమ అధినేత కేజ్రీవాలే కొనసాగుతారని.. తమకు మరో మార్గం లేదని మంత్రి అతీషి సింగ్ స్పష్టం చేశారు. అవసరమైతే ఆయన జైలు నుంచే పని చేస్తారని స్పష్టంచేశారు. ఆయనను అలా చేయకుండా నిరోధించే చట్టం ఏదీ లేదని.. ఆయనను కేవలం అదుపులోకి తీసుకున్నారని శిక్ష పడలేదని ఆమె పేర్కొన్నారు. అయితే జైలు నుంచి ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో దాణా కుంభకోణంలో అరెస్టైన లాలూ ప్రసాద్ యాదవ్.. తన భార్య రబ్రీదేవికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా గవర్నర్‌ను కలిసి రాజీనామా చేశారని పేర్కొంటున్నాయి.

కాగా ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేజ్రీవాల్‌‌కు ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే తనను ఈడీ అరెస్ట్‌ నుంచి రక్షించాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అరెస్ట్‌కు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియాలతో పాటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్ట్ చేసిన విషయం విధితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.