close
Choose your channels

చంద్రబాబుకు ఈ చెత్త సలహా ఇచ్చిందెవరబ్బా!?

Saturday, September 28, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబుకు ఈ చెత్త సలహా ఇచ్చిందెవరబ్బా!?

టీడీపీ అధినేత చంద్రబాబుకు కొందరు పనిగట్టుకుని మరీ చెత్త సలహాలిస్తున్నారా..? బాబును డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారా..? వారి సలహాలను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు గుడ్డికి నమ్మేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది.

భూతద్ధం పెట్టినా కష్టమే..!
తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ మాట తెలంగాణలో ఉన్న కాస్తో కూస్తో టీడీపీ నేతలకు బాధ కలిగించినప్పటికీ ఇది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు రాష్ట్ర మొత్తమ్మీద తెలుగు తమ్ముళ్లు ఎంత మంది ఉన్నారనేది సింపుల్ వేలల్లో లెక్కపెట్టి చెప్పేయచ్చు. ఖమ్మంలో ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలు అది కూడా సండ్ర వెంకట వీరయ్య ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికీ ఆయన తెలియదు.. మిగిలిందల్లా మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే. ఆ తర్వాత కాస్త గట్టిగా వినపడే.. టీవీల్లో కనపడే పేర్లు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ మాత్రమే. ఇంతకు మించి భూతద్ధం పెట్టి వెతుకున్నా నేతలు కనపడరు.. కనపడబోరు కూడా.

ఇప్పటికే ముగ్గురు.. ఇప్పుడు మరొకరు!
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి సూపర్‌గా ఉండేది.. ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో.. అప్పుడు టీడీపీ కనుమరుగైపోయింది. ఒకప్పుడు డబుల్ ఫిగర్ ఉండే ఎమ్మెల్యేలు 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం కేవలం రెండుకు మాత్రమే పరిమితమయ్యారంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికొస్తే.. నల్లొండ జిల్లా హుజుర్ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ కమ్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మా పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి.. మరోవైపు బీజేపీ కూడా బీసీ అభ్యర్థికి టికెట్ ఫిక్స్ చేసేసింది. అయితే సడన్‌గా టీడీపీ సైతం బరిలోకి దిగింది.

ఎందుకీ ప్రయోగాలు!?
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుసు.. వాళ్లతో పాటు రాష్ట్రంలో అంతంత మాత్రం ఉండే నేతలకూ.. వీరందరి కంటే ముఖ్యంగా చంద్రబాబుకు చాలా బాగా తెలుసు. అన్నీ తెలిసినప్పటికి చంద్రబాబు ఎందుకిలా ప్రయోగాలు చేస్తున్నారో..? ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారో..? అన్నది పైనున్న పెరుమాళ్లకే తెలియాలి.

ఇంతకీ చెత్త సలహాలిస్తున్నదెవరు..!?
‘చంద్రబాబుకు అసలు ఇలాంటి చెత్త సలహాలు ఎవరిస్తారబ్బా..? పోనీ సలహాలు ఇచ్చినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఏమైంది..? వెనకా ముందు ఆలోచించనక్కర్లేదా..? కొందరు కావాలనే చంద్రబాబును ఇలా డైవర్ట్ చేస్తున్నారేమో..? ఇలాంటి ప్రయోగాలకు చంద్రబాబు చాలా దూరంగా ఉండి హుందాగా ఉంటే మంచిది..?.. పోటీ చేయడం తప్పు కాదు.. పట్టు ఏ మాత్రం ఉందన్నది ఇక్కడ పాయింట్.. పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలి కదా..!’ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్-కారు పార్టీ!
వాస్తవానికి ఇది కాంగ్రెస్ కంచుకోటన్న సంగతి తెలిసిందే. కంచుకోటలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురేయాలని అధిష్టానం ఎత్తులు, వ్యూహాలు రచిస్తోంది. అయితే కాంగ్రెస్ ఎత్తులను చిత్తు చేస్తూ టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికల్లో తృటిలో ఎమ్మెల్యే సీటు పోవడంతో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలి.. అధికారంలో ఉండి ఉపఎన్నికల్లో గెలవకపోతే ఎలా..? అని ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

బాబు ప్రయోగానికి ఎన్ని ఓట్లు పడతాయో!
ఇప్పటికే ముందస్తు ఎన్నికల్లో ఫ్రంట్.. అది ఇదీ అని చంద్రబాబు పెద్ద చెడ్డపేరు తెచ్చుకున్నారని.. అసలు చంద్రబాబుతో దోస్తీ మాకొద్దన్నా ఆయనే వచ్చారని.. ఆయన వల్ల మాకు ఒరిగిందేమీ లేదని.. ఆయన లేకుంటేనే మాకు సీట్లు పెరిగేవని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మీడియాకు ముందుకొచ్చి బాహాటంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అందుకేనేమో ఈసారి కూటమి.. పొత్తు అనేది పక్కనెట్టి చంద్రబాబు సొంత ప్రయోగం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మరి బాబు ప్రయోగానికి ఎన్ని ఓట్లు వచ్చి పడతాయో..? మరి కారు వేగానికి సైకిల్, హస్తం దరిదాపుల్లో ఉంటాయో లేదో..? ఎవరి ప్రభావం అధికార, ప్రతిపక్ష పార్టీలపై పడుతుందో..? ఎవరికి ఏ మాత్రం ఓట్లు వస్తాయో తెలియాలంటే ఎన్నిక జరిగి.. ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.