close
Choose your channels

Janasena : కాపులు ఓట్లు అమ్ముకున్నారా, రుజువు చేయకుంటే ... జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: పంతం నానాజీ

Saturday, July 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Janasena : కాపులు ఓట్లు అమ్ముకున్నారా, రుజువు చేయకుంటే ... జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: పంతం నానాజీ

మొదటి నుంచి కాపులను కించపరచడానికి.. వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ. కాకినాడ కాస్మో పాలిటన్ క్లబ్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కాపు నాయకులను వైసీపీ పార్టీలోని అదే సామాజిక వర్గం వారితో ఇష్టానుసారం తిట్టించి ఆనందం పొందటం జగన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటేనన్నారు. కాపునేస్తం విడుదల చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆ పనిని పూర్తిగా పక్కన పెట్టేశారని... కాపులపై తనకున్న కోపాన్ని ప్రదర్శించడానికి ఈ సభను వాడుకున్నారని నానాజీ దుయ్యబట్టారు.

తూర్పుగోదావరికి ఎప్పుడొచ్చినా కాపులపై చిన్నచూపే:

కాపులకు సంబంధించిన కార్యక్రమంలో వారి మనోభావాలు కించపరిచేలా సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు ఎక్కువగా ఉండే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా జగన్ రెడ్డి కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారని ఫైరయ్యారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఇష్టానుసారం కాపులపై తనకు ఉన్న చిన్న చూపును బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాపులు ఓట్లు అమ్ముకునే వారని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం అత్యంత బాధాకరమని నానాజీ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో అత్యంత ఎక్కువగా ఉండే కాపులు ఎప్పుడు ఓట్లు అమ్ముకున్నారో ముఖ్యమంత్రి రుజువు చేయాలని, లేకుంటే మొత్తం కాపు జాతికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని నానాజీ డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపుల ఓట్లతో గెలవలేదా? అలా గెలవలేదు అని వారు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు సైతం కాపులకు అన్యాయం చేశాయని.. ఇప్పుడు కూడా కాకి లెక్కలతో కాపులను మభ్య పెడుతున్నారని నానాజీ ఫైరయ్యారు.

రోడ్లు ఎక్కడ అని అడిగితే బూతులతో సమాధానం:

రూ. 2వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్నారని... అవెక్కడ అని అడిగితే బూతులు తిడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడా కనిపించడం లేదని... రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టి నిధులు తెచ్చి పథకాలను నిర్వహిస్తున్నారన్నారు. దీని వల్ల భవిష్యత్ అంధకారం తప్పదని నానాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు సభలో వాలంటీర్లు, అంగన్వాడీలు బలవంతంగా కూర్చున్నారని... వారిని బలవంతంగా సభకు తరలించారని ఆయన ఆరోపించారు. ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి మరి జన సమీకరణ చేయడం సిగ్గుచేటన్నారు.

కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నేతలు స్పందించరా:

కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదని నానాజీ ప్రశ్నించారు. సీఎం జగన్ లంక గ్రామాల్లో పర్యటించలేదని.. వరద ప్రాంతాల్లో కేవలం కొందరినీ ఎంపిక చేసి.. వారితో ముఖ్యమంత్రికి అంతా బాగుందని చెప్పించి ఈ ప్రభుత్వ అధికారులు చంకలు గుద్దుకుంటున్నారని నానాజీ ఆరోపించారు. జనసేన పార్టీ వరద బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసిందని.. బాధితులకు అవసరమైన నిత్యవసరాలతో పాటు బట్టలు, ఇతరత్రా అవసరాలు తీర్చామన్నారు. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భయపడుతూ పరామర్శలెందుకు :

అంత భయపడుతూ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించడం దేనికి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని నానాజీ తెలిపారు. వారికి ఏం కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందున్నామని.. పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికి సీఎం, నాయకులకు కనీస అర్హత లేదన్నారు. ఏలేరు కాలువ బాగుచేస్తానని గతంలో హామీ ఇచ్చారని.. దీనికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పళ్లంరాజు నిధులు మంజూరు చేశారని నానాజీ గుర్తుచేశారు. కానీ దీనిని మళ్ళీ ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కాపు నేస్తం లిస్టుల్లో ఉన్న గందరగోళం తొలగించి.. కాపుల సంక్షేమానికి ఎంత కేటాయించరో లెక్కలు చెప్పాలని నానాజీ డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos