close
Choose your channels

జనసేనానికి ఝలక్ ఇచ్చిన ఏకైక ఏమ్మెల్యే!

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేనానికి ఝలక్ ఇచ్చిన ఏకైక ఏమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ.. ఆ పార్టీ తరఫున పోటీచేసిన రాపాక వరప్రసాద్ గెలిచి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. దీంతో రాపాక పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మార్మోగింది. వాస్తవానికి పార్టీ అధినేత అది కూడా రెండు చోట్ల పోటీ చేసిన అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు ఇప్పటి వరకూ అస్సల్లవ్.! అయితే ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యేను కూడా ఎలా చూసుకోవాలో పార్టీ అధినేత పవన్‌కు తెలియట్లేదని అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పార్టీ అధినేత-రాపాక మధ్య ఏం గొడవలున్నాయో..? ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. అస్తమానూ ఈ వన్ అండ్ ఓన్లీ మాత్రం పవన్‌ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తేయడం.. ఆ తర్వాత జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం గట్రా పనులు చేసిన రాపాక తాజాగా.. పవన్‌కు ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చారు.

నా దారి రహదారి!
వాస్తవానికి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పని సరి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పవన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఆ హడావుడి మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మరోవైపు ‘ఎవరేం అనుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. నా దారి రహదారి’ అంటూ జ‘గన్’ బుల్లెట్‌లాగా దూసుకెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడోరోజు ఇంగ్లీష్ మీడియం బోధనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎవరికి తోచిన అభిప్రాయాలు సభ్యులు చెప్పారు. ఈ క్రమంలో జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లేచి.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు. ఏకైక ఎమ్మెల్యే కావడంతో అడగ్గానే స్పీకర్ చాన్స్ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఈ ఇంగ్లీష్ బోధనను వ్యతిరికించాల్సింది పోయి.. ప్రశంసించారు. దీంతో జనసేన అధినేతకు ఊహించని షాక్ ఎదురైనట్లయ్యింది.

రాపాక అసలేమన్నాడు!?
‘ఇంగ్లీష్ మీడియం విషయం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. చంద్రబాబు సర్కారు మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియం ప్రయత్నాలను జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉంది’ అని అసెంబ్లీ వేదికగా రాపాక వ్యాఖ్యానించారు. అంటే జనసేనానిని పక్కనెట్టి వైఎస్ జగన్‌కు జై కొట్టారన్న మాట.

పవన్‌తో నాకు ఇబ్బందులున్నాయ్!
‘పవన్‌కు నాకు మధ్యలో అడ్డంకులు ఉన్నాయి. మా మధ్య అడ్డంకి తోలుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసనని అన్నారు. చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని నేను స్వాగతించాను. జనసేన పార్టీకి నాకు మధ్య కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉంది. దానిని సరిచేసుకుంటాను. ఎన్నికల్లో గెలుపు కోసం నేను కమిటీలు ఏర్పాటు చేసుకున్నాను.
నాలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమో..?’ అని వ్యాఖ్యానించారు.

పవన్ దీక్షకు వెళ్లట్లేదు!
కాగా.. రైతుల సమస్యలపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు ‘రైతు సౌభాగ్య దీక్ష’ అనే పేరు కూడా పెట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వరకు తీసుకెళ్లేందుకు తాను దీక్ష చేస్తున్నానని, కాకినాడలో ఒకరోజు పాటు ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. అయితే ఈ దీక్ష గురించి మాట్లాడిన రాపాక.. తాను ఈ దీక్షకు వెళ్లట్లేదని.. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు బలపరుస్తామని ఆయన మరో బాంబ్ పేల్చారు.

ఉంటారా.. ఉష్ అంటారా..!?
కాగా కొన్ని నెలల క్రితం రాపాక మీడియాతో మాట్లాడుతూ.. తాను వైసీపీలో చేరితే నంబర్ 152గా నిలుస్తానని.. అదే జనసేనలో ఉంటే తన నంబర్ ఒక్కటిగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇలా అస్తమానూ ఏదో ఒకటి మాట్లాడుతుండటం.. మరీ ముఖ్యంగా అసెంబ్లీ కాబట్టి ఏదో మాట్లాడేశారనుకుంటే ఇక మీడియా ముందుకు వచ్చి ఏకంగా పవన్‌కు తనకు మధ్య కొన్ని కొన్ని ఇబ్బందులున్నాయని రాపాక చెప్పడంతో జనసైనికులు.. మెగాభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు..? అసలేం జరుగుతోంది..? ఇంతకీ రాపాక పార్టీలో ఉంటాడు హుష్ కాకీ అంటారా..? అని నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు రాపాక పరిస్థితేంటో తెలియక పవన్ కల్యాణ్ జుట్టుపీక్కుంటున్నారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.