close
Choose your channels

Narendra Modi:కాలికి బలపం కట్టుకుని తిరిగినా.. ఫలించని మోడీ మ్యాజిక్, బీజేపీకి షాకిచ్చిన కర్ణాటక

Saturday, May 13, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశమంతా పాగా వేస్తూ వస్తున్న బీజేపీకి దక్షిణాది కొరకరాని కొయ్యగా మారింది. ప్రాంతీయ పార్టీల హవాతో పాటు కుల సమీకరణలు, అనేక కారణాలతో దక్షిణ భారతదేశం బీజేపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. అయితే బీజేపీ దక్షిణాదిన అధికారంలో వున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ ఆ పార్టీ నిలదొక్కుకోవడానికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. యడియూరప్ప వంటి బలమైన నేతలు, లింగాయత్ సామాజిక వర్గం, మతానికి ప్రాధాన్యత వంటి అంశాలు బీజేపీకి అక్కడ తిరుగులేని శక్తిగా మార్చాయి.

ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించిన మోడీ :

ఇదిలావుండగా..సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటక రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఈసారైనా అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్, కింగ్ మేకర్‌గా మారాలని జేడీఎస్ ఎన్నో అస్త్రశస్త్రాలను సంధించాయి. బీజేపీ అయితే హేమాహేమీలను రంగంలోకి దించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ నేతలు ప్రచారం నిర్వహంచారు. అన్నింటిలోకి మోడీ తీవ్రంగా శ్రమించారు. 20కి పైగా ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగసభలతో ఆయన మోత మోగించారు. ఇంత చేస్తే ఫలితం శూన్యం. కర్ణాటకలో మోడీ మ్యాజిక్ ఏమాత్రం పనిచేయలేదు. శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేకపోయింది. హస్తం పార్టీ 120 స్థానాల్లో, కమలం 70 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. జేడీఎస్ సాయంతో అధికారాన్ని అందుకోవడానికి కూడా ఛాన్స్‌ లేకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు కన్నడ ఓటర్లు.

లింగాయత్‌ల ఆగ్రహం:

అయితే బీజేపీ దారుణ పరాజయానికి చాలా కారణాలే వున్నాయని అంటున్నారు విశ్లేషకులు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సీనియర్లు, బలమైన నేతలను పక్కనబెట్టడం, అవినీతి ఆరోపణలు ఇవన్నీ పార్టీని ముంచేశాయని అంటున్నారు. కానీ అన్నింటిలోకి మాజీ సీఎం యడియూరప్పను పూర్తిగా పక్కనబెట్టడం బీజేపీ నడ్డి విరిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా, శక్తివంతమైన నేతగా వున్న యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించడాన్ని ఆ వర్గం జీర్ణించుకోలేకపోయింది.

యడియూరప్పను గౌరవించని బీజేపీ అధిష్టానం :

బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఏడు పదుల వయసు దాటిన వారు పదవుల్లో వుండకూడదన్న నిబంధనను అనుసరించి యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించారు. లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ.. ఆ వర్గం ఆయనను అంతగా పట్టించుకోలేదు. దీనికి తోడు యడ్డీకి కేంద్రంలో కానీ, పార్టీలో కానీ కీలక పదవిని కట్టబెట్టకపోవడాన్ని లింగాయత్‌లు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆ వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయి. అలా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు బీజేపీ ఓటమికి కారణం ఒకటని చెప్పలేం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.