close
Choose your channels

Ray Stevenson:ఆర్ఆర్ఆర్ విలన్ రే స్టీవెన్సన్ హఠాన్మరణం.. షాక్‌లో చిత్ర పరిశ్రమ, ఆర్ఆర్ఆర్ యూనిట్ సంతాపం

Tuesday, May 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంగీత దర్శకుడు రాజ్, దిగ్గజ నటుడు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయితే రే మరణానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు. ఆర్ఆర్ఆర్‌లో బ్రిటీష్ గవర్నర్ స్కాట్ బక్స్‌టన్ పాత్రలో స్టీవెన్సన్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

థోర్ సిరీస్‌తో స్టీవెన్సన్‌కు గుర్తింపు :

1964 మే 25న నార్త్ ఐర్లాండ్‌లో జన్మించిన స్టీవెన్సన్ 1990వ దశకంలో టీవీ షోల ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1998లో వచ్చిన ది థియరీ ఆఫ్ ఫ్లైట్ చిత్రంతో వెండితెరకు అరంగేట్రం చేశారు. ముఖ్యంగా థోర్ సిరీస్‌, స్టార్ వార్స్, వైకింగ్స్, ట్రాన్స్‌పోర్టర్ లాంటి మెగా మూవీలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. 1997లో రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని స్టీవెన్సన్ వివాహం చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరకాలంలో ఆంత్రోపాలజిస్ట్ ఎలిసబెట్టా కరాకియాతో రే సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా.

విడుదలకు సిద్ధంగా స్టీవెన్సన్ చిత్రాలు :

ఆపై 2000 నుంచి హాలీవుడ్ యాక్షన్ చిత్రాలతో స్టీవెన్సన్‌కు మంచి పేరు వచ్చింది. ఆంటోయిన్ ఫుక్వా 2004లో తెరకెక్కించిన అడ్వెంచర్ మూవీ ‘‘కింగ్ ఆర్ధర్’’తో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 2008లో మార్వెల్ సంస్థ తెరకెక్కించిన ‘‘పనిషర్ : వార్ జోన్’’లో కీలకపాత్ర పోషించారు. తెరపై పనిషర్ పాత్రను పోషించిన మూడవ నటుడు స్టీవెన్సన్. 2010లలో స్టీవెన్సన్ ‘‘ ది బుక్ ఆఫ్ ఎలి’’, ‘‘జీఐ’’ వంటి యాక్షన్ సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన అషోకా సిరీస్‌ ఈ వేసవిలో డిస్నీ ప్లస్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు ‘‘1242 : గేట్ వే టు ది వెస్ట్’’, ‘‘క్యాసినో ఇన్ ఇషియా’’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. కానీ ఇంతలోనే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంతాపం తెలిపిన ఆర్ఆర్ఆర్ యూనిట్ :

రే స్టీవెన్సన్ మరణం పట్ల హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మీ ఆకస్మిక మరణం తమను షాక్‌కు గురిచేసిందని.. మీ ఆత్మకు శాంతి కలగాలని, మీరెప్పుడూ మా హృదయాల్లో నిలిచే వుంటారని ట్వీట్‌లో పేర్కొంది ఆర్ఆర్ఆర్ యూనిట్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.