close
Choose your channels

బిగ్‌బాస్ సీజన్‌ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి... రెండోసారి కటకటాల వెనక్కి అర్జున్

Saturday, October 1, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ సీజన్ 6లో తొలిసారి ఓ మహిళా కెప్టెన్‌కి ఛాన్స్ దొరికింది అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా కీర్తి భట్ కెప్టెన్ కావడం విశేషం. అస్సలు కెమెరా స్పేస్‌ కోసం ప్రయత్నించకుండా.. ఏమాత్రం టాస్కుల్లో సత్తా చాటని ఆమెకు కెప్టెన్‌గా ఛాన్స్ దక్కడం ఆశ్చర్యకరమే. ఈ వారం హోస్ట్ నాగార్జున చేత నేరుగా నామినేట్ కావడంతో పాటు ఓటింగ్‌లోనూ అంతంత మాత్రంగానే వున్న కీర్తి డేంజర్‌ జోన్‌లో వుంది. ఇప్పుడు ఏకంగా కెప్టెన్ కావడంతో ఆమెకు ఈ వారం ఎలిమినేషన్ గండం తప్పినట్లయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బాలాదిత్య, రాజ్, ఆదిరెడ్డిలు కెప్టెన్ కీరిటం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీపడిన వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. కీర్తి, శ్రీసత్య, సుదీపలు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు.

నిన్నటి ఎపిసోడ్‌లోని ‘‘పంచ్ పడింది’’ టాస్క్‌ను కొనసాగించారు బిగ్‌బాస్. ఇందులో గ్లవ్‌ను దక్కించుకున్న ఇనయా... ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ అమ్మాయిలే కెప్టెన్ కావాలని చెబుతూ శ్రీహాన్ ఫోటోపై పంచ్ ఇచ్చింది. తర్వాత శ్రీహాన్‌కి గ్లవ్ దక్కడంతో అతను రోహిత్‌ను పోటీ నుంచి తప్పించాడు. తర్వాత అర్జున్ కల్యాణ్ గ్లవ్‌ను సంపాదించి ఆరోహి ఫోటోపై పంచ్ ఇచ్చాడు. దీంతో సుదీప, శ్రీసత్య, కీర్తిలు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. దీనిలో భాగంగా వీరికి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. కెప్టెన్ అనే ఆంగ్ల అక్షరాలను ఒక్కొక్కటి తీసుకొచ్చి హుక్స్‌కి తగిలించాలి. అయితే అక్షరాలని తీసుకుని వెళ్లే సమయంలో బిగ్‌బాస్ ఇచ్చిన ప్యాడ్స్‌పైనే నడవాల్సి వుంటుంది. ఇచ్చిన రెండేసి ప్యాడ్స్‌ని ముందుకు జరుపుకుంటూ గమ్యం చేరుకుని అక్షరాలిని అమర్చి కెప్టెన్ అనే పదం తయారు చేయాలి. వీరిలో అందరికంటే బాగా ఆడి కీర్తి కెప్టెన్ అయ్యింది. దీంతో బాలాదిత్య అందరికీ స్పూర్తి... మా కెప్టెన్ కీర్తి అంటూ నినాదాలు అందుకున్నాడు. అయితే మన అర్జున్ కల్యాణ్ ఇక్కడా పులిహోర కలిపే ఛాన్స్ వదులుకోలేదు. కెప్టెన్సీ పోటీలో అలసిపోయి మూలన కూర్చొన్న శ్రీసత్య కాళ్లు నొక్కుతూ కనిపించాడు.

తర్వాత వరస్ట్ పెర్ఫార్మర్ తేల్చే ప్రక్రియను మొదలుపెట్టాడు బిగ్‌బాస్. లాన్‌లో బాక్స్ పెట్టి వరస్ట్ పెర్ఫార్మర్ అనుకుంటున్న వారి పేరు అందులో రాసి వేయాలని, అందుకు కారణం కూడా చెప్పమని చెప్పాడు. అంతే కంటెస్టెంట్స్ అంతా మరో మాట లేకుండా అర్జున్ కల్యాణ్ పేరే రాశారు. ఫైమా, సుదీప, చంట, ఆరోహి, కీర్తి, ఆర్జే సూర్య, మెరీనా అండ్ రోహిత్‌లు అతనికే ఓటేయడంతో అర్జున్ కల్యాణ్‌ని జైల్లో పెట్టారు. అయితే అర్జున్ కల్యాణ్ ఇక్కడే ఓ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. బిగ్‌బాస్ ఏ సీజన్‌లోనూ ఏ కంటెస్టెంట్ రెండోసారి జైలుకు వెళ్లలేదు. దానిని మనోడు సొంతం చేసుకున్నాడు. అతను జైల్లోకి వెళ్లిన తర్వాత శ్రీసత్య రియలైజ్ అయ్యింది. అతని దగ్గర కూర్చొని .. నువ్వు బిగ్‌బాస్ హౌస్‌కి ఎందుకొచ్చావ్, నా కోసమా.. నీ కోసమా అని ప్రశ్నించింది. దీనికి నా కోసమే అని చెప్పిన అతను.. కెమెరాల వైపు చూస్తూ ఒక్క ఛాన్స్ ఇస్తే .. నా గేమ్ ఏంటో చూపిస్తాని చెప్పాడు.

ఇకపోతే.. రేపు హోస్ట్ నాగార్జున వస్తుండటంతో ఎవరికి గడ్డి పెడతారో, ఎవరికి క్లాస్ పీకుతారోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం మొత్తం పది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో కీర్తి కెప్టెన్ కావడంతో 9 మంది నామినేషన్స్‌లో వున్నట్లు లెక్క. మరి వీరిలో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.