close
Choose your channels

నా సినీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ ‘మిస్టర్ కేకే’!

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

నా సినీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ ‘మిస్టర్ కేకే’!

టాలీవుడ్‌లో ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’ చిత్రాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విక్ర‌మ్. లాంగ్ గ్యాప్ తర్వాత ‘మిస్టర్ కేకే’గా విక్రమ్ అభిమానుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజేష్ ఎం.సెల్వ తెరకెక్కించగా.. అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ మూవీని తెలుగులో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్‌లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో.. నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌పై జూలై 19న విడుద‌ల చేస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా.. మంగళవారం నాడు విక్రమ్ మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన, లాంగ్ గ్యాప్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌!!

"ఇంట‌ర్నేష‌న‌ల్ స్టైల్లో తెర‌కెక్కిన సినిమా ‘మిస్ట‌ర్ కెకె’. నా సినిమా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ను ఈ సినిమాలో పోషించాను. అది పాజిటివా? నెగ‌టివా? అని ముందే పసిగ‌ట్ట‌డం ప్రేక్ష‌కుడికి వీలుకాదు. గ్రే షేడ్స్ ఉండే పాత్ర నాది. రేపు సినిమా చూసే స‌మ‌యంలో ఆ విష‌యం మీకే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాకు క‌థే ముఖ్యం. అన్ని స‌మ‌యాల్లో అది కుద‌ర‌క‌పోవ‌చ్చు. మంచి క‌థ ఉన్న‌ప్పుడు గొప్ప క్యారెక్ట‌ర్ ఉండ‌క‌పోచ్చు. కొన్ని సినిమాల‌కు క్యారెక్ట‌ర్ పేరే సినిమా టైటిల్‌గా ఉంటుంది. అంటే పాత్ర అంత బాగా ఉంటుంద‌నేగా.

ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది!

"నార్మ‌ల్‌గా డైలాగ్స్ వ‌ల్లే మ‌నం పెర్‌ఫార్మ‌న్స్ చేయ‌గ‌లుగుతాం.. అలాంటిది డైలాగ్స్ లేకుండా నేను న‌టించానంటే.. ఏదో ఒక పార్ట్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ చేస్తుంద‌నే న‌మ్ముతాను. నేటివిటీ కార‌ణంగానే ఆడియెన్ సినిమాకు క‌నెక్ట్ కాడు. ఎమోష‌న్ మాత్ర‌మే క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌తి న‌టుడు డ‌బ్బుకోస‌మో, ఏదో చేద్దాం లే! అనేలా కాకుండా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తాడు. నా విష‌యానికి వ‌స్తే నాకు హిట్ వ‌చ్చిన ‘సేతు’ సినిమాకు ముందు 10-12 ఏళ్ల నుండి సినిమాలు చేస్తున్నాను. కానీ బ్రేక్ రాలేదు. ప్ర‌తి సినిమా చేసే స‌మ‌యంలో ఇది నాకు క‌చ్చితంగా బ్రేక్ ఇస్తుంద‌ని అనుకునే చేశాను. న‌టుడిగా నేను ఏ సినిమా చేసినా ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్‌నే ఎంచుకుంటాను. అందుకే ఇండియ‌న్ సినిమాలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమాలున్నాయి. తెలుగులో నాకు న‌చ్చే స్క్రిప్ట్ వ‌స్తే సినిమా చేస్తాను" అని విక్రమ్ చెప్పుకొచ్చారు.

కాగా.. లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ‘మిస్టర్ కేకే’ వీరాభిమానులను, సినీ ప్రియులను ఏ మాత్రం మెప్పించి హిట్ ఖాతాలో వేసుకుంటారో తెలియాలంటే జులై-19వరకు వేచి చూడాల్సిందే మరి.
 

Get Breaking News Alerts From IndiaGlitz