close
Choose your channels

పార్లమెంట్‌లో ఏ నోట విన్నా ‘దిశ’.. కేంద్రం కీలక ప్రకటన

Monday, December 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌లో చోటుచేసుకున్న ‘దిశ’ హత్య ఉదంతంపై ఇవాళ పార్లమెంట్‌లో పెద్ద చర్చే జరిగింది. ముందుగా చెప్పినట్లుగానే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించగా.. కాంగ్రెస్ ఎంపీలతో పలు పార్టీలకు చెందిన సభ్యులు ఈ విషయంపై మాట్లాడారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆ నలుగురు కామాంధులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఎంపీలతో ఏకంగా డెడ్ లైన్ విధించి ఫలానా తేదీలోపే ఆ నలుగుర్నీ ఉరితీసేయాలని పట్టుబట్టారు. అటు రాజ్యసభలోనూ ఇదే చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.

రాజ్యసభలో ఇలా..!
దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని.. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై దాడులు ఆగడం లేదని.. దోషులను కఠినంగా శిక్షించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ కేంద్రాన్ని కోరారు. మరోవైపు.. దిశ ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోందని.. పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని.. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్‌ ఉండాలి టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో పేర్కొన్నారు.

లోక్‌సభలో..
దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారని.. తెలంగాణ హోంమంత్రి వ్యాఖ్యలు బాధాకరమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. దిశ కుటుంబసభ్యులను పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పారని.. తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. మరోవైపు బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసిందని.. సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన అని అన్నారు. దోషులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే ఘటనలు పునరావృతం కావని.. మహిళలను చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళా ఎంపీల మాటల్లో..!
‘నిర్భయను తలపించేలా హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది. నిర్భయ కేసులో ఇప్పటివరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయలేదు. చట్టాల్లో మార్పుల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దోషులకు వెంటనే ఉరిశిక్ష పడేలా చట్టాలు తేవాలి’ అని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్‌ కవిత డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ.. దిశ ఘటనలో రాజకీయాలు చేయొద్దని.. మోదీ..370 రద్దుతో భరతమాత తల ఎత్తుకునే చేశారన్నారు. మహిళల భద్రత కోసం కూడా పటిష్టమైన చట్టం తేవాలని.. మహిళలను పూజించాల్సిన అవసరం లేదుకానీ.. బతకనివ్వండి అని ఈ సందర్భంగా గీత వ్యాఖ్యానించారు.

రేవంత్, రామ్మోహన్ ఏమన్నారంటే..
‘నిర్భయ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగడం లేదు. అత్యాచార దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్ధమైన చట్టాలు తేవాలి. మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి’ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ‘దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దేశం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 9నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన దోషికి హైకోర్టు శిక్ష తగ్గించింది. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లయినా ఇప్పటికీ శిక్ష అమలు చేయలేదు. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఫైనల్‌గా కేంద్రం కీలక ప్రకటన:-
పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు మాట విన్న కేంద్ర మంత్రి రాజనాథ్‌ సింగ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ‘దిశ ఘటనను పార్టీలకతీతంగా ఖండించాలి. ఇలాంటి ఘటనలపై కఠినచర్యలు తీసుకుంటాం. అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధం’ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దిశ ఘటనపై దిగ్భ్రాంతి చెందానని, పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై కేంద్రం సీరియస్‌గా ఉందని, కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో తెలిపారు.

మొత్తానికి చూస్తే.. కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తానని చెప్పడం మంచి నిర్ణయమే. అయితే ఆ చట్టం ఎలా ఉంటుంది..? తద్వారా ఎలాంటి శిక్షలు ఉంటాయ్..? అనేది మాత్రం ఇప్పటికీ ఊహకందట్లేదు. పోనీ.. విదేశాల్లో మాదిరిగా ఉరిశిక్ష, అంగ చేధన లాంటి శిక్షలను కేంద్రం తీసుకొస్తుందో లేకుంటే మరెలాంటి చట్టం తీసుకొస్తుందో అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.