close
Choose your channels

Padma Rao Goud:సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్.. హోరాహోరీ పోరు తప్పదా..?

Saturday, March 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోక్‌సభ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరైన అభ్యర్థిగా నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

1986లో రాజకీయాల్లోకి వచ్చిన పద్మారావు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్‌ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లోనూ శాసనసభ్యునిగా విజయం సాధించి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ క్రమంలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మొన్నటి దాకా ఒకే పార్టీలో మిత్రులుగా ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు వేరు వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేయనుండటం విశేషం.

మరోవైపు బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచే ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ముగ్గురు దిగ్గజ నేతలు బరిలో దిగడంతో ఇక్కడి ఎన్నిక హోరాహోరీ పోరును తలపించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంట్ ఎ్ననికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం రాష్ట్రమంతా చర్చనీయాంశం కానుంది. మరి ముగ్గురిలో ఎవరినీ విజయం వరిస్తుందో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.

ఇక భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌, నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని వెల్లడించాల్సి ఉంది.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.