close
Choose your channels

Bigg Boss Telugu 7 : శివాజీ బూతులు.. ఇంట్లో ఆ పదాలు బ్యాన్ చేసిన నాగ్ , ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చేసిన యావర్

Sunday, November 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగులో 11 వారాలు గడిచిపోయాయి. మరికొద్దిరోజుల్లో షో ముగియనుంది. చివరి వరకు వచ్చేసరికి షో ఉత్కంఠగా మారుతోంది. ఈ వారం మొత్తం ఎవిక్షన్ ఫ్రీ ఫాస్ కోసం రచ్చ నడిచింది. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులు .. ఎవిక్షన్ ఫ్రీ కోసం ఇచ్చిన టాస్క్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఇన్నిరోజులు జరిగిన సీజన్‌లో దాదాపు అందరికీ కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కానీ ప్రియాంక, అమర్‌దీప్‌లు మాత్రం కెప్టెన్ కాలేకపోయారు. ప్రతిసారి చివరి వరకు రావడం, ఏదో ఒక కారణంతో మరొకరు కెప్టెన్ బ్యాడ్జ్‌ను ఎగరేసుకుపోవడం జరుగుతోంది.

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఆశ్చర్యకరంగా అమర్‌దీప్, ప్రియాంకల మధ్య నడిచింది. తొలుత కంటెస్టెంట్స్ అంతా ఇటుకలు సేకరించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. తక్కువ ఇటుకలు సేకరించిన వారు ఎలిమినేట్ అవుతూ వుంటారు. అర్జున్, అమర్‌దీప్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ రేసులో సెకండ్ రౌండ్‌కు చేరుకున్నారు. ఈ రౌండ్‌లో మాత్రం మిగిలిన కంటెస్టెంట్స్ నుంచి తమ టవర్స్‌ను కాపాడుకోవాలి. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్, అర్జున్‌లు ఎలిమినేట్ కాగా.. అమర్‌దీప్, ప్రియాంక కెప్టెన్సీ రేసులో నిలిచారు. ప్రియాంక కోసం గౌతమ్, అమర్‌ కోసం శోభాశెట్టిలు సపోర్ట్‌గా నిలబడ్డారు. ఈ గేమ్‌లో అమర్‌దీప్ ఓడిపోయి ప్రియాంక గెలిచింది.

చివరి యత్నంలోనూ తాను గెలవకపోవడంతో అమర్‌దీప్ బాగా ఎమోషనలై ఏడవటం మొదలుపెట్టాడు. అతనిని చూసి ప్రియాంక సైతం బాధపడింది. చిన్నప్పటి నుంచి తాను ఏం కోరుకున్నా దక్కేది కాదని ప్రియాంకకు చెబుతూ కంటతడి పెట్టాడు. ఇక శనివారం కావడంతో నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. తల మీద సీసా పగులగొట్టి చెప్పాల్సిన విషయాలు చాలానే వున్నాయని సీరియస్‌గా కనిపించారు. ముందుగా ఇంటికి పెద్ద మనిషి శివాజీని పిలిచి.. ఎర్రి పోహా, పిచ్చి పోహా.. ఇవన్నీ హౌస్‌లో వాడే పదాలా అని ప్రశ్నించారు.

వాటిని తాను కావాలని అనలేదని, అలా వచ్చేస్తున్నాయని కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఈ విషయంలో నీ అనుభం ఏమైంది.. ఈ విషయంలో నీ సహనం ఏమైంది ..? ఈ విషయంలో నీ సమర్ధత ఏమైంది అని ప్రశ్నించాడు. ఇలాంటి పదాలను హౌస్‌లో నిషేధిస్తున్నానని నాగ్ స్పష్టం చేశాడు. రతిక కూడా శివాజీ తరహాలోనే వచ్చినప్పటి నుంచి ఇదే తరహాలో బూతులు మాట్లాడటంతో నాగార్జున క్లాస్ పీకారు. టాస్కుల్లో ఆమె ఏ మాత్రం యాక్టీవ్‌గా ఆడటం లేదని ఫైర్ అయ్యారు. అందుకే అందరి ఫోటోలపై ఒక్కొక్క సీసా పగులగొట్టిన నాగార్జున.. రతిక ఫోటోపై మాత్రం మూడు సీసాలు పగులగొట్టారు.

అనంతరం అమర్‌దీప్, గౌతమ్, పల్లవి ప్రశాంత్‌లను సున్నితంగా మందలించారు నాగ్. తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న యావర్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని నాగార్జున బయటపెట్టారు. యావర్‌ను విజేతగా ప్రకటిస్తూ శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ నిర్ణయాన్ని సమర్ధించారు. ప్రియాంక రూల్స్ ప్రకారం ఆడినా ముందుగానే విల్లు వదిలేసింది కాబట్టి ఓడిపోయినట్లేనని నాగ్ పేర్కొన్నారు. అయితే ఇక్కడే యావర్ తన క్యారెక్టర్ బయటపెట్టారు. తొలుత అర్జున్‌తో పోటీ పడినప్పుడు , తర్వాత విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేసే టాస్క్‌లో యావర్ తప్పులేంటీ అని నాగ్ వీడియో ప్లే చేశాడు. దీంతో తన ఆట సరిగా లేదని, ఎవిక్షన్ ఫ్రీ పాస్ తన దగ్గర వుండటం కరెక్ట్ కాదని , తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు.

ఈ పాస్‌ను తిరిగి ఇచ్చేయడం సరైన నిర్ణయమేనా అని నాగార్జున ఇంటి సభ్యులను ప్రశ్నించాడు. దీనికి అమర్‌, ప్రియాంక, శోభాశెట్టి మాత్రమే చేతులు పైకెత్తారు. చివరికి ఆ పాస‌ను తిరిగి ఇచ్చేస్తానని యావర్ పట్టుబట్టగా.. దానిని స్టోర్ రూమ్‌లో పెట్టాల్సిందిగా నాగ్ ఆదేశించారు. తనకు పాస్ కంటే క్యారెక్టరే ముఖ్యమని స్పష్టం చేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.