close
Choose your channels

టీడీపీ ఘోర ఓటమికి కారణాలివే.. కుండ బద్ధలు కొట్టిన నేతలు

Friday, June 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ ఘోర ఓటమికి కారణాలివే.. కుండ బద్ధలు కొట్టిన నేతలు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిపై సమీక్షలు మొదలు పెట్టింది. వైసీపీకి ఊహించని భారీ మెజార్టీ సీట్లు దక్కడం టీడీపీకి మాత్రం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను అయితే తీసుకుందో.. అదే ఫిగర్ దక్కడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే.. ఏకంగా మంత్రులు, సీనియర్లు ఓడిపోవడంపై పోస్ట్ మార్టమ్ చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి ఓటమికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నేతల నుంచి ఊహించని సమాధానాలు.. ఏకంగా అధినేత దగ్గరే కుండ బద్ధలు కొట్టడంతో చంద్రబాబు ఒకింత కంగుతిన్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో తప్పులపై టీడీపీ వర్క్ షాప్‌లో నేతలు గళమెత్తారు.

కుండబద్ధలు కొట్టిన అశోక్!

మరీముఖ్యంగా.. మాజీ ఎంపీ అశోక్‌గజపతి రాజు ఎలాంటి మొహమాటం లేకుండా చంద్రబాబుకు తన మనసులోని మాటను చెప్పేశారు. వేల మందితో చంద్రబాబు నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదు.. ఇది అసలు తప్పు అని ఆయన చెప్పేశారు. వేల మందితో కాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని అశోక్ గజపతి రాజు.. బాబుకు వివరించారు. మరికొందరు రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదికలు ముంచాయని అభిప్రాయపడితే.. ఇంకొందరు పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా.. వారికే టికెట్లు ఇవ్వడం ఓటమికి కారణమని వ్యాఖ్యానించారట.

జూపూడి, దివ్యవాణి ఏం చెప్పారు!

తెలుగుదేశం పార్టీలో ‘హ్యూమన్ టచ్’ పోయిందని.. కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు బాగా దూరం అయ్యారని.. పార్టీని నిర్లక్ష్యంకు గురవుతున్న విషయం పెద్దలు గుర్తించలేదు అని సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రియల్ టైం గవర్నెన్స్ నివేదికలు కొంప ముంచాయని.. గతంలో.. ఇప్పుడూ అధికారులను పక్కన పెట్టుకోవడం వల్లనే కొంప మునిగిందని ఎమ్మెల్సీ శ్రీనివాసులు వాపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ కుటుంబ అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి.. చంద్రబాబుకు నిశితంగా వివరించారు. అంతటితో ఆగని ఆమె.. గ్రామ స్థాయిలో నేతల అవినీతిపై అధినేతకు చెప్పే అవకాశమే లేకుండా కొందరు నేతలు చేశారన్నారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందం అధినేతకు వాస్తవాలు తెలియకుండా చేశారన్నారు.

ఇదిలా ఉంటే.. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుతామని అనంతపురం జిల్లా నేతలు.. చంద్రబాబుకు వివరించారు. ఈ టైమ్‌లో నేతలంతా కలిసి లేకపోతే మరింత నష్టం జరుగుతుందని అనంత నేతలు.. పార్టీ అధినేతకు స్పష్టం చేశారు. నేతలు చెప్పిన అంశాలను సావదానంగా విన్న టీడీపీ అధినేత.. లోపాలను సరిచేసుకొని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారని తెలుస్తోంది. ఇవన్నీ అటుంచితే సమావేశంలో ముఖ్యంగా పార్టీ మారే నేతల గురించి నిశితంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, టీవీ డిబెట్‌లో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి టచ్‌లో ఉన్నారని ఉన్నట్టుండి బాంబు పేల్చిన విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.