close
Choose your channels

Vallabhaneni Janardhan : మరో విలక్షణ నటుడిని కోల్పోయిన టాలీవుడ్.. గ్యాంగ్‌లీడర్‌లో ‘ఎస్పీ’వల్లభనేని జనార్థన్ కన్నుమూత

Thursday, December 29, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పటికే కైకాల సత్యనారాయణ, చలపతిరావుల మరణంతో తీవ్ర విషాదంలో వున్న తెలుగు చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్ధన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనార్థన్ గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.అమెరికాలో వున్న కుమారుడు భారతదేశానికి వచ్చాక జనార్థన్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం వుంది.

ఇది వల్లభనేని జనార్థన్ ప్రస్థానం:

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పోతనూరులో 1959లో జన్మించిన జనార్థన్‌కు చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి ఎక్కువ. కాలేజీ రోజుల్లో విజయవాడలో నాటకాలు వేశారు. అనంతరం ‘‘కళామాధురి’’ అనే నాటక సంస్థను స్థాపించి నాటకాలు వేసేవారు. అనంతరం ఇండస్ట్రీలో అడుగుపెట్టి... కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన గజదొంగ చిత్రానికి దర్శకత్వ శాఖలో అప్రెంటీస్‌గా పనిచేశారు. సినిమాల్లో నిలదొక్కుకుంటున్న సమయంలో ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కుమార్తె నళిని చౌదరిని జనార్థన్ వివాహమాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దమ్మాయి శ్వేత చిన్నతనంలోనే మరణించగా.. రెండో కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్‌గా, అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

21 ఏళ్లకే నిర్మాతగా సంచలనం:

సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన జనార్థన్ ‘‘మామ్మగారి మనవలు’’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తుండగా.. అది అనుకోకుండా ఆగిపోయింది. అనంతరం కన్నడ చిత్రం మానస సరోవర్‌ను తెలుగులో అమాయక చక్రవర్తి పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా.. అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీలో మంచి విజయం అందుకున్న బసేరా మూవీని శోభన్ బాబు హీరోగా ‘‘తోడు నీడు’’ పేరుతో రీమేక్ చేశారు. అనంతరం తన పెద్ద కుమార్తె శ్వేత పేరుతో ‘‘శ్వేత ఇంటర్నేషనల్’’ బ్యానర్ స్థాపించి.. శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు వంటి సినిమాలు నిర్మించారు. శ్రీమతి కావాలిలో చిత్రంలో మంచి గుర్తింపు రావడంతో నటుడిగా స్ధిరపడిపోయారు జనార్థన్.

చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌లో ‘‘ఎస్పీ’’ పాత్రతో గుర్తింపు:

ముఖ్యంగా తన మామయ్య విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్‌లీడర్ సినిమాలో ఎస్పీ పాత్రతో ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తర్వాత వెంకటేశ్‌తో సూర్య ఐపీఎస్, నాగార్జునతో వారసుడు, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహా సినిమాల్లో జనార్థన్ నటించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన నీ కోసం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించిన వల్లభనేని జనార్థన్ అన్వేషిత సీరియల్‌లోనూ నటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.