close
Choose your channels

వినోదంతో పాటు మరపురాని అనుభూతిని అందించే చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా - డైరెక్టర్ శివరాజ్ కనుమూరి

Thursday, November 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాతో నా ప్రణయం, ప్రయాణం ముంబాయిలో వర్మ కార్పొరేషన్ లో సహాయ దర్శకుని గా చేరటం తో మొదలయ్యింది. వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలపై ఉండే మక్కువ నన్ను ఆర్జీవీ స్కూల్లో చేరేలా చేసింది. నా తొలిచిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా" వాస్తవికతకి దగ్గరగా ఉంటూ, సహజమైన పాత్రలని, ప్రాంతీయతిని ప్రతిబింబిస్తుంది.
సాధారణంగా సినిమాల్లో వినోదాన్ని చూపించే పని ఎక్కువ చేస్తుంటాం. అయితే ఈ చిత్రం మాత్రం వినోదంతో పాటు ఒక మరపురాని అనుభూతిని ప్రేక్షకులకి మిగల్చాలనే తపనతో తీసింది. ఈ "జయమ్ము నిశ్చయమ్మురా" అత్యంత సహజసిధ్ధమైన సన్నివేశలతోనూ, ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో చూసే సాధారణ పాత్రలతోనూ తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో చేసినది.
ఇక కథాంశానికి వస్తే, తనమీద తనకే నమ్మకం లేక ఆత్మ న్యూనతా భావం తో కొట్టుమిట్టాడుతూ , అతని జీవితంలో పొందే అవకాశాలు, అతనికి ఎదురయ్యే అవరోధాల సమాహారమే ఈ చిత్రం. వ్యక్తిత్వ వికాసం నన్ను బాగా ప్రభావితం చేసిన విషయం అందుకే ఈ సినిమాలోని కథానాయకుడి పాత్ర ద్వారా సాధ్యమైనంత వ్యక్తిత్వ వికాసాన్ని వినోదమార్గంలో చూపించే ప్రయత్నం చేసాను. ఇక ఇందులోని ఉపకథలన్నీ కథానాయకుడికి తోడ్పడేవో లేక అడ్డుపడేవో అయి ఉంటాయి. కరీంనగర్ నుంచి కాకినాడ వరకు చేసిన ప్రయాణంలో నా కంటికి ఇంపుగా అనిపించిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని ఈ చిత్రం లోని సన్నివేశాలని చిత్రీకరించాం. ఈ ప్రక్రియ నా చిత్రాన్ని అందంగా తెరకెక్కించడానికి దోహదపడింది.
"జయమ్ము నిశ్చయమ్మురా" కి ఉపశీర్షికగా "దేశవాళీ వినోదం" ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది సహజత్వానికి, ప్రాంతీయతకి దగ్గరగా ఉండే వినోదం కనుక. నా ఈ చిత్రాన్ని తీయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపిన కళారూపాలు - రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి "అల్పజీవి", రోబర్ట్ హేమర్ తీసిన "స్కూల్ ఆఫ్ స్కౌండ్రెల్స్ (1960)", బసు చటర్జీ తీసిన "చోటీ సీ బాత్ (1975)", ఇంకా బిల్లీ వైల్డర్ తీసిన "ది అపార్ట్మెంట్ (1960).
మనం నమ్మిన దాన్ని మనం సినిమాగా తీస్తాం. ప్రేక్షకుల నమ్మకాలకి అవి ఎంత దగ్గరగా ఉన్నాయ్ అనే ప్రాతిపదిక మీద ఆ కథకుని విజయం ఆధారపడి ఉంటుంది. మా ప్రచారంలో మేము ఏర్పరిచిన అంచనాలకు మించి ఈ సినిమా బాగుందని ప్రేక్షకులు అన్నప్పుడే మేము విజయం సాధించినట్టు. ఈనెల‌ 25 న ప్రపంచవ్యాప్తంగా "జయమ్ము నిశ్చయమ్మురా" విడుదల అవుతోంది. మీ సమీపంలోని థియేటర్ కు వెళ్లి సినిమాని వెంటనే చూస్తారని ఆశిస్తున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.