close
Choose your channels

రవిప్రకాష్ కోసం పోలీసుల గాలింపు

Thursday, May 9, 2019 • తెలుగు Comments

అడ్రస్ లేకుండా పోయిన టీవీ9 రవిప్రకాష్.. పోలీసుల వేట

తెలుగులో టాప్ చానల్‌గా పేరొందిన టీవీ9 గత ఏడాది ఆగస్టు నుంచి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ఈసారి ఏకంగా సదరు చానెల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న రవిప్రకాష్ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్ట్‌లో టీవీ9 చేతులు మారిన విషయం విదితమే. అయితే కొత్తగా కొన్న అలందా మీడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తుండగా దాన్ని అడ్డుకునేందుకు టీవీ9 సీఈవో రవిప్రకాష్‌ సంతకాలు ఫోర్జరీ చేసి గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ అడ్డంకులు సృష్టిస్తూ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రకాష్ ఇంట్లో, టీవీ9 ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకూ ఏమేం స్వాధీనం చేసుకున్నారనే విషయం తెలియరాలేదు. గత రెండ్రోజులుగా రవిప్రకాష్ అడ్రస్ లేకుండా పోయాడని.. పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు.

నిధులు ఏమయ్యాయ్!

టీవీ9కు సంబంధించిన నిధులు వేరే సంస్థకు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎంత మొత్తంలో నిధులు మళ్లించారు..? అసలు ఇన్నెన్ని ఆరోపణలు వస్తున్న రవిప్రకాష్ రెండ్రోజులుగా ఎక్కడికెళ్లి పోయారు..? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ప్రస్తుతం టీవీ9 యథావిథిగా నడుస్తోంది. ఇదిలా ఉంటే.. సోదాల్లో భాగంగా కొన్ని కీలక పత్రాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలేమైంది..!

టీవీ9లో 90శాతం షేర్లు ఉన్న అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజు నుంచి గత ఏడాది ఆగస్టులో అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది.  దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో అలందా మీడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను నియమించుకునే పనిలో నిమగ్నమవ్వగా.. అడగడుగునా అడ్డుకుంటున్న రవిప్రకాష్ ఆఖరికి అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు  ఫోర్జరీ చేశారు.. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. టీవీ9 యాజమాన్య మార్పుపై రవిప్రకాష్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  టీవీ9 సంస్థ మొత్తం ఆయన చేతిలోనే ఉండాలనుకున్నారాని వార్తలు వినవస్తున్నాయి.

రవిప్రకాష్‌కు ఉండే షేర్స్ ఎంత..?

శ్రీనిరాజుకు 90 శాతం రవిప్రకాష్‌కు కేవలం 10 శాతం మాత్రమే షేర్స్ ఉండేవి. అయినప్పటికీ రవిప్రకాశే పెత్తనం చెలాయిస్తుండే వారు. ఆయన తన షేర్స్ మొత్తం అమ్మేయగా రవిప్రకాశ్ మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీవీ9 మొత్తం అలంద మీడియా చేతుల్లో ఉంది. రవికి ఉన్నది తక్కువ షేర్లే అయినా పేరు మోసిన జర్నలిస్ట్.. అందులో పెద్ద చానెల్ సీఈవో గనుక కొత్త యాజమాన్యాన్ని రవిప్రకాష్ ఇబ్బంది పెట్టి.. ఒకనొక సందర్భంలో బెదిరింపులకూ పాల్పడినట్లు తెలుస్తోంది. నలుగురు డైరెక్టర్లను బోర్డులో చేర్చడానికి తీర్మానించింది. అంతేకాదు కేంద్ర సమాచార శాఖ అనుమతి ఇచ్చినా కొత్త డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్ అడ్డు తగిలారు. దీంతో చేసేదేమీ లేక ఫోర్జరీ సంతకాలు చేసి అసలు విషయం బయటపడటంతో పరారయ్యారని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాష్, అతని అనుచరుల కోసం సైబర్ క్రైం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా.. రెండ్రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాష్ ఎక్కడికెళ్లారు..? ఏమయ్యారు..? అని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

చిక్కుల్లో శివాజీ.. రవిప్రకాష్ ఎక్కడ..?

ఇదిలా ఉంటే.. ఆఫ్రికాలో రవిప్రకాష్‌కు కేబుల్ బిజినెస్ ఉందని చెబుతుంటారు. ఆయన అక్కడికెళ్లి తలదాచుకుని ఉండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు ... రవిప్రకాశ్‌ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్‌ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్‌ చేస్తూ శివాజీ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే శివాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తారని సమాచారం.

సీఈవోగా రవిప్రకాష్ తొలగింపు..!

టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Get Breaking News Alerts From IndiaGlitz