close
Choose your channels

Karunanidhi: ప్రతి పాత్రకు న్యాయం, అందుకే ఆయన 'కలైంజర్’ : కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో ఉపరాష్ట్రపతి

Monday, May 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కృషి చేశారని ప్రశంసించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. స్థానిక ఓమందూరార్‌ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని శనివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరని కొనియాడారు. తమిళనాడులో పారిశ్రామిక ప్రగతి, సమాచార, సాంకేతిక విప్లవానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కరుణానిధి కీలకపాత్ర పోషించారని వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు.

ఎమర్జెన్సీని కరుణానిధి వ్యతిరేకించారు:

తన రాజకీయ సిద్ధాంతం విషయంలో కరుణానిధి నిబద్ధతతో వున్నారని ప్రశంసించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర పరిస్థితిని కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లపాటు తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారని ఉపరాష్ట్రపతి తెలిపారు. తన వాక్చాతుర్యం, చక్కటి పద ప్రయోగంతో శ్రోతలను కట్టి పడేసే ప్రసంగాలెన్నో కలైంజర్‌ చేశారన్నారు. సాంస్కృతిక, కళాత్మకత కలిగిన కళాకారుడిగా, పాత్రికేయుడిగా, విమర్శకుడిగా ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ప్రజల గుండెల్లో ‘కలైంజర్‌’గా గుర్తింపు పొందారని, తమకున్న అనుభవంతో తమిళనాడు సమగ్రాభివృద్ధికి బాటలు వేశారని వెంకయ్య నాయుడు ప్రశంసించారు.

కరుణానిధి మాటల్లో హ్యూమర్ - గ్రామర్ – గ్లామర్:

మాతృదేశంతో పాటు మాతృభాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న కరుణానిధిని యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కరుణానిధి తమిళ భాష సాహిత్యాలను ప్రోత్సహించారని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తమ భాషా సంస్కృతులను ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు. కరుణ మాటల్లో హ్యూమర్‌ (హాస్య చతురత), గ్రామర్‌ (విషయ పరిజ్ఞానం), గ్లామర్‌ (ఆకర్షణ) మూడు సమ్మిళితమై ఉంటాయని వెంకయ్య నాయుడు అన్నారు. 1970లో ఆయన ప్రార్థనా గీతంగా గుర్తింపు తీసుకొచ్చిన ‘తమిళ్‌ తై వాళ్తు..’ ఆ తరువాత రాష్ట్ర గీతంగా ప్రఖ్యాతి సంపాదించుకుని, నేటికీ తమిళలకు స్ఫూర్తి రగిలిస్తోందన్నారు. తమిళనాడు గొప్ప కళలకు కేంద్ర బిందువని, కరుణానిధి విగ్రహం తయారు చేసిన కళాకారులు అభినందనీయులన్నారు.

మాతృభాషను కాపాడుకునేందుకు ఉద్యమం చేశారు :

ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం గానీ, దూరం చేయడం గానీ సరైన విధానాలు కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాలానుగుణంగా ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మభాషను ముందు మన గుండెల్లో నిలుపుకోవాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కరుణానిధిలో తనకు బాగా నచ్చిన గుణం, మాతృభాషను కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో కృషి చేయడమేనని గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి తమిళనాడులోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరుకావడం పట్ల ఉపరాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. ఏకీభవించకపోవడాన్ని ఏకీభవించడమే ప్రజాస్వామ్యంలోని గొప్ప సూత్రమని, వారి మాటలతో ఏకీభవించకపోయినా, గౌరవించడం మాత్రం మానకూడదని సూచించారు. అంతిమంగా పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే రాజకీయ నాయకుల ప్రధాన అజెండా కావాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.