close
Choose your channels

ప్రపంచాన్ని వణికిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ప్రమాదం స్థాయెంత?

Tuesday, December 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపించిన టైటిల్స్.. ‘ప్రపంచమా ఊపిరి తీసుకో.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది’ అని. కానీ ఇప్పుడు అలా చెప్పేంత అయితే లేదు. ప్రపంచాన్ని మరోమారు ఓ కొత్తరకం వైరస్ వణికిస్తోంది. ఇటీవల ఈ వైరస్ బ్రిటన్‌లో వెలుగు చూసింది. దీని కారణంగా బ్రిటన్‌లోని లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలను సైతం రద్దు చేసింది. ఇప్పటికే పలు దేశాలు యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ప్రపంచాన్ని మరోమారు వణికిస్తున్న ఈ కొత్తరకం వైరస్ ఏంటి? దాని ప్రమాద స్థాయి ఎంత? తాజాగా వస్తున్న వ్యాక్సిన్‌లు దానిని ఏ మేరకు అడ్డుకోగలవనే అంశాలపై చిన్న క్లారిటీ..

70 శాతం వ్యాప్తి అధికం..

కరోనా వైరస్ వెలుగు చూసి ఏడాది దాటుతోంది. కానీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. వ్యాక్సిన్ వస్తోంది త్వరలోనే ఈ వైరస్‌కు అంతం అని ప్రపంచ దేశాలన్నీ ఆనందంగా ఉన్న వేళ.. దానిపై నీళ్లు చల్లుతూ యూకేలో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఇది అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాప్తి విషయంలో కరోనా వైరస్ కంట 70 శాతం వేగం ఎక్కువని అంటున్నారు. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని యూకే ఆరోగ్య శాఖ నిపుణుల బృందం అయిన న్యూ అండ్ ఎమ‌ర్జింగ్ రెస్పిరేట‌రీ వైర‌స్ థ్రెట్స్ అడ్వైజ‌రీ గ్రూప్ వెల్ల‌డించింది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వోకు కూడా చెప్పినట్టు బ్రిట‌న్ ప్ర‌భుత్వ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ క్రిస్ విట్టీ తెలిపారు. ఈ కొత్త ర‌కం వైర‌స్‌ను VUI-202012/01(స్ట్రెయిన్ వైరస్‌)గా గుర్తించారు. అయితే దీని వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నట్టు కానీ.. మరణాల రేటును పెంచుతున్న దాఖలాలు లేకపోవడం కాస్త ఊరటనిస్తున్న అంశం. కానీ కొన్ని వారాల్లోనే ఈ వైరస్ 60 శాతానికి పెరిగినట్టు కింగ్స్ కాలేజ్ లండ‌న్ ప్రొఫెస‌ర్ స్టువ‌ర్ట్ నీల్ వెల్ల‌డించారు.

అన్ని మ్యుటేషన్లు ప్రమాదకరం కావు..

వైరస్ పునరుత్పత్తి ఫలితంగా జన్యుక్రమంలో మార్పుల కారణంగా ఇలా రూపు మార్చుకుంటుంది. వైరస్ హోస్ట్ సెల్‌తో కలిసి తన జన్యు పదార్థాన్ని అందులోకి పంపిస్తుంది. అయితే కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి వేలల్లో మ్యుటేషన్లు వచ్చాయి. కానీ వాటిలో చాలా మ్యుటేషన్లు ప్రమాదకరం కావు.. అందులో కొన్ని మాత్రం ప్రమాదకరంగా కనిపించాయి. కాగా.. సౌతాఫ్రికాలోనూ కొద్ది రోజుల క్రితం 501.V2 వేరియంట్‌ను క‌నుగొన్నారు. ఇది ముఖ్యంగా యువ‌త‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిన‌ట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంత‌కుముందు D614G మ్యుటేష‌న్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ.. ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురి చేసింది.

వ్యాక్సిన్ ఈ మ్యుటేషన్‌పై ఎంత మేరకు పని చేస్తుందంటే..

బ్రిటన్‌లో కొత్త వైరస్ వెలుగు చూసిన అనంతరమే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం వివిధ దేశాల్లో పౌరులకు అందించేందుకు సిద్ధంగా ఉన్న కరోనా వ్యాక్సిన్ ఈ స్ట్రెయిన్ వైరస్‌ను నియంత్రించగలదా? లేదా.. అన్న ప్రశ్న మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పన్నమవుతోంది. దీనిపై కింగ్స్ కాలేజ్ ప్రొఫెస‌ర్ స్టువర్ట్ నీల్ ప్ర‌కారం.. సాధార‌ణంగా వ్యాక్సిన్లు వైర‌స్‌లోని స్పైక్ ప్రొటీన్ ల‌క్ష్యంగా ప‌ని చేస్తాయి. ఆ స్పైక్ ప్రొటీన్‌లోనే మ్యుటేష‌న్ అనేది వైర‌స్ సామ‌ర్థ్యాన్ని మ‌రింత పెంచుతాయ‌ని స్టువ‌ర్ట్ నీల్ తెలిపారు. అయితే సాధారణంగా వ్యాక్సిన్‌ను వివిధ మ్యుటేషన్లపై పరీక్షించిన అనంతరమే తీసుకొస్తారని.. కాబట్టి ఈ స‌వాలును వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయ‌ని ప‌లువురు నిపుణులు విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. వెల్లూర్ క్రిస్టియ‌న్ మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్ గ‌గ‌న్‌దీప్ కాంగ్ సైతం దాదాపు ఇదే విషయాన్ని వెల్లడించారు. స్పైక్ ప్రొటీన్‌లోని వివిధ ప్రాంతాల‌పై వ్యాక్సిన్ దాడి చేస్తుంద‌ని, ఒక చోట మ్యుటేష‌న్ జ‌రిగినంత మాత్రాన వ్యాక్సిన్ పని చేయ‌కుండా ఉండ‌ద‌ని గగన్ దీప్ కాంగ్ తెలిపారు. అయితే ప్రస్తుత వ్యాక్సిన్ పని చేయని స్థాయికి మ్యుటేట్ కావాలంటే అది వెంటనే సాధ్యపడదని.. కొన్నేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.