close
Choose your channels

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి: పవన్

Sunday, January 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలి: పవన్

గ్రామ స్వరాజ్యంతోనే పల్లెలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని మహాత్మా గాంధీ ఎంతో దూరదృష్టితో చెప్పిన మాటలు అనేక సందర్భాలలో నిజమని నిరూపించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నిల్లో యువతను భాగస్వామ్యం చేసే దిశగా ఆయన కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగానే పంచాయతీల్లో యువత భాగస్వామ్యాన్ని కోరుతూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పటిష్టమైన నాయకత్వం చేతిలో వున్న గ్రామాలు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నాయన్నారు. చక్కని రోడ్లు, ఆధునిక పద్ధతుల్లో మురుగు నీటిపారుదల వ్యవస్థ, ఆరోగ్యకరమైన మంచి నీరు, పౌర వసతులు సమకూరడం మనం చూస్తూనే ఉన్నామని.. మీడియాలో వస్తున్న అనేక కథనాలను చదువుతూనే ఉన్నామని పవన్ పేర్కొన్నారు.

‘‘మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ లో రాబోతోంది. సుమారు 12 వేలు పైచిలుకు పంచాయితీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. 18-19 వయస్సు వారు 5,39,804 మంది, 18-35 వయస్సు వారు 68 లక్షల మంది, 18-45 వయస్సు వారు 1,08,00,000 మంది యువ ఓటర్లు ఉన్నారు. అయితే పంచాయితీ పాలనను సుపరిపాలనగా మార్చాలంటే యువత ముందుకు కదలాలి. పంచాయితీల ప్రగతికి దిశానిర్దేశం చేసి, సుఫలమైన ఫలితాలు సాధించ కలిగిన శక్తి సామర్ధ్యాలు ఆంధ్రప్రదేశ్ లోని యువతలో పుష్కలంగా ఉన్నాయని నేను ధృడంగా విశ్వసిస్తున్నాను. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సద్వినియోగం కావాలంటే పంచాయతీల్లో యువత భాగస్వామ్యం ఎంతైనా అవసరం.

యువతను భవిష్యత్ నాయకులుగా రూపుదిద్దడం జనసేన ఆశయాలలో ముఖ్యమైన అంశం అన్న విషయం మీకు విదితమే. అందువల్ల ఈ ఎన్నికలలో యువత కీలకమైన పాత్ర పోషించవలసిందిగా కోరుతున్నాను. మన గ్రామాలను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపించాలన్న ఆలోచనలు ఉన్న యువతీ, యువకులు ఇప్పుడు జరగనున్న పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి మీకు సంపూర్ణ మద్దతు అందచేస్తామని హామీ ఇస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.