close
Choose your channels

Chandrababu: జనంలో జగన్‌పై తిరుగుబాటు మొదలైంది: చంద్రబాబు

Thursday, April 25, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Chandrababu: జనంలో జగన్‌పై తిరుగుబాటు మొదలైంది: చంద్రబాబు

రాష్ట్రంలో జగన్‌పై ఇప్పటికే జనంలో తిరుగుబాటు మొదలైందని.. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాజంపేటలో కూటమి అభ్యర్థిగా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మిథున్ రెడ్డిని ఓడిస్తేనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం బాగుపడుతుందని అన్నారు. రాజంపేటలో వైసీపీకి ఓటు వేస్తే అరాచకం తప్ప అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని స్పష్టంచేశారు.

ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. పేదలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. తామిద్దరం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇన్నాళ్లకు రాజంపేట ద్వారా తమ కాంబినేషన్ కుదిరిందని చమత్కరించారు. ఎంపీగా కిరణ్ కుమార్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Chandrababu: జనంలో జగన్‌పై తిరుగుబాటు మొదలైంది: చంద్రబాబు

ఇక పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ సారా వ్యాపారాలు చేసే మిథున్ రెడ్డి తాను పోటీ చేసి పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తాడట అని విమర్శించారు. ఓసారి తాను ఢిల్లీలో మిథున్ రెడ్డిని కలిస్తే "మేం మా జిల్లాకు ఎవరినీ రానివ్వం.. మా జిల్లాకు ఎవరొచ్చినా ఎదుర్కొని తొక్కేస్తాం అని ఆ పెద్దమనిషి చాలా అందంగా చెప్పాడు. ఈ జిల్లాలో సంపద అంతా కేవలం ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, మిథున్ రెడ్డి చేతుల్లోనే సంపద ఉంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన దుర్ఘటనే వైసీపీ ఇసుక దోపిడీకి నిదర్శనం. ఇష్టానుసారం ఇసుక దోచేసి డ్యాం గేట్లు తెగిపోతున్నా పట్టించుకోలేదు" అని మండిపడ్డారు.

"ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసలమని కాగే రక్తం మీది! గొలుసులు తెంచుకునే కండబలం మీది! మరి గుండెబలం ఎందుకు లేదు మీకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండెబలం ఉందా, లేదా?" అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని పాతాళానికి తొక్కేస్తున్నాం... కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఉద్ఘాటించారు. కూటమి తరఫున రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పవన్ పిలుపునిచ్చారు.

ఇక ఈ సభలో ఓ ఆసక్తికర దృశ్యం నెలకొంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి పక్కపక్కనే నిలబడి నవ్వుతూ కనిపించారు. ఇలా ఒకే వేదికపై వారిద్దరు కలవదం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసింతే. ఆ సమయంలో అసెంబ్లీలో కిరణ్ కుమార్, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగేది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.