close
Choose your channels

అది మీ పని కాదు.. ఆ సర్టిఫికెట్లు గుర్తించబోం, ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీం సంచలన తీర్పు

Friday, June 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెళ్లిళ్లు కోసం ప్రేమికులు, లేక సాధారణ ప్రజలు ఇకపై ఆర్య సమాజ్‌కు వెళితే అలాంటి వారికి చిక్కులు తప్పవు. ఆర్య సమాజ్‌లో జారీ చేసే వివాహ ధ్రువీకరణ పత్రాలను చెల్లవని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ యువకుడు తమ కుమార్తెను అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మధ్యప్రదేశ్ వ్యక్తి పిటిషన్‌:

తమ కుమార్తె మైనర్ అని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ఆ యువకుడు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తన భార్య మేజరేనని.. ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చి తనను పెళ్లాడిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆర్య సమాజ్ మందిర్‌లో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పిన అతను .. ఇందుకు సంబంధించిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించాడు.

ఆర్య సమాజ్ సర్టిఫికెట్ కాదు.. నిజమైన పత్రం కావాలి:

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్య సమాజ్ జారీ చేసిన పత్రాన్ని తిరస్కరించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్ పని కాదని.. వాటికి ఆ అర్హత లేదని, ఇందుకు చట్టపరంగా అధికారులు వున్నారని.. తమకు నిజమైన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని ధర్మాసనం పేర్కొంది.

ఆర్యసమాజ్ సర్టిఫికెట్లపై విచారణకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం:

ఇక మరో కేసులో ఆర్య సమాజ్ జారీ చేసిన సర్టిఫికెట్లపై విచారణకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. వివాహ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లోని కిడ్‌గంజ్‌లో వున్న ఆర్య సమాజ్ పనితీరు, పద్ధతిపై దర్యాప్తు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఐదేళ్లలో సంతోష్ కుమార్ శాస్త్రి జరిపిన అన్ని వివాహాల రిజిస్టర్లను సమర్పించాలని కూడా జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ రజనీష్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.

ఇకపోతే.. హిందూమతంలో సంస్కరణలు, వేదాలపై విశ్వాసంతో విలువలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో 1875లో స్వామి దయానంద్ సరస్వతి ఆర్య సమాజ్‌ను స్థాపించారు. అయితే పౌర హక్కులు, సమానత్వం కోసం పోరాడుతున్న ఆర్య సమాజ్ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ వస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.