close
Choose your channels

Bandla Ganesh: హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

Monday, January 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Bandla Ganesh: మాజీ మంత్రలు హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

టాలీవుడ్ అగ్ర నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో గణేశ్ మాట్లాడుతూ నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. కేవలం నెల రోజులే పరిపాలించిన రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు, కేటీఆర్, కవితలకు ఎందుకింత ద్వేషం అని మిర్శించారు. వారికి ఈర్ష్య పీక్ స్టేజ్‌కు చేరుకుందని దుయ్యబట్టారు.

వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పప్పులుడకవని హరీష్ రావు అన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అదే వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో బిర్యానీ, చికెన్ అన్నీ ఉడుకుతాయని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పదేళ్ల నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆరోగ్య భీమాను రూ. 10 లక్షలు చేశామని గుర్తుచేశారు.

నెల రోజుల్లోనే ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే..హరీష్ రావు ఎందుకింత ఈర్ష్య పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందని అర్ధం చేసుకోకుండా హరీష్, కేటీఆర్ ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తమ మంత్రులు దర్యాప్తు చేస్తున్నారని తప్పు చేసిన ఏ నాయకుడిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

Bandla Ganesh: మాజీ మంత్రలు హరీష్‌రావు, కేటీఆర్‌లపై బండ్ల గణేశ్‌ తీవ్ర విమర్శలు

అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కోసం ఈ పది సంవత్సరాలు ఏం చేశారు? తెలంగాణకు రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా? అని నిలదీశారు. కానీ తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ తెలంగాణకి రావలసిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు మెచ్చకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందన్నారు.

రాష్ట్రపతి, ప్రధాని రాష్ట్రానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం స్వాగతం పలకాడినికి కూడా వెళ్లలేదని.. కానీ కాంగ్రెస్‌ సీఎం రేవంత్ రెడ్డి మాజీ రాష్ట్రపతి వచ్చినా మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారని తెలిపారు. ఇదే దొరల పాలనకు, ప్రజా పాలనకు ఉన్న తేడా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ సచివాలయానికి వెళ్లి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మీ బీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు సచివాలయం నుంచి పనిచేశారా అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని జోస్యం చెప్పారు. ఇది తన ఛాలెంజ్ అని.. రాసిపెట్టుకోండని హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.