close
Choose your channels

Chandrababu:చంద్రబాబు ఎన్నికల హామీలకు విలువ ఉందా..? ప్రజలు ఏమనుకుంటున్నారు..?

Thursday, April 11, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికలు వచ్చాయంటే చాలు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ లేని హామీలు ఇస్తూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తరు. 2014 ఎన్నికల సమయంలో అనేక అలవికానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే అందులో ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో గతంలో తాను ఇది చేసి చూపించానని చెప్పుకోలేరు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో.. అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి ఉంటే ఎందుకు చెప్పుకోరు? అవి ఏమి అమలు చేయకుండా ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడం కోసం అలవికాని హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మొన్నటి వరకు ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పుల పాలవుతుందని విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఎన్నికలు రాగానే లెక్కలేనన్ని ఉచితాలు ప్రకటించడం వెనుక ఉద్దేశ్యం ఏంటి? అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాన్ని రూ.2వేలకు పెంచి ప్రగల్భాలు పలుకుతున్నారు. అలాంటి బాబు ఇప్పుడు ఏకంగా రూ.4వేలు పింఛన్, దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలు ఇస్తానని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారంటే.. లేరు అనే సమాధానం వస్తోంది.

నిన్నటి వరకు వాలంటీర్లంటే గోనె సంచులు మోసేవారని.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి మహిళలను వేధిస్తార‌ని తప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు ఎన్నికల వేళ వారిని మచ్చిక చేసుకునే కొత్త నాటకానికి తెరతీశారు. మ‌ళ్ళీ అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌ను కొన‌సాగిస్తాన‌ని.. అంతేకాకుండా వారి వేత‌నం రూ.10వేలకు పెంచుతాన‌ని హామీ ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు అవకాశ రాజకీయాలు చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గు పడే పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇవే కాదు సూపర్ సిక్స్ అంటూ టీడీపీ చెబుతున్న హామీలు చూశాక.. ఆయన ఇదివరకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా చేసిన మోసాలు ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు.

అందుకే చంద్రబాబు, ఎల్లోమీడియా చేసే ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అటు ప్రజలే కాదు.. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు పథకాలను ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు ఉండి నియోజకవర్గంలో టీడీపీకి నిరసన సెగలు తగులుతున్నాయి. నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు తొలుత చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించారని తెలుస్తోంది. దీంతో అభ్యర్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని చంద్రబాబు.. తాను ఉచిత పథకాలు ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు.

సీఎం వైయస్ జగన్ తన ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీలను 98శాతం నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అందుకే జగన్ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో జగన్‌కే ప్రజల మద్దతు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.