close
Choose your channels

CM Revanth Reddy:సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు..

Friday, February 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ విచారణ చేపట్టింది. దీనిపై రేవంత్‌ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నాలుగు వారాల్లో స్పందించాలని పేర్కొంది. మరి ఈ నోటీసులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. అలాగే హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కేసులో విచారణపై ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. విచారణపై ప్రభావం చూపిస్తే తాము చూస్తూ ఎలా ఉంటామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రేవంత్ రెడ్డిపై ఇప్పటివరకు 88 కేసులు నమోదయ్యాయని కూడా గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో ట్రయల్‌ను నిలిపివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు పనిచేసిన పోలీస్ అధికారులను నగ్నంగా పరేడ్ చేస్తానని రేవంత్ హెచ్చరించిన ఆధారాలను కోర్టుకు అందించారు. జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మహహ్మద్ అలీ, సత్యవతి రాధోడ్ కూడా బదిలీ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో సుప్రీం నోటీసులతో ఏం జరగబోతోంది..? అనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015లో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు రేవంత్ డబ్బులు ఇవ్వజూపారు. స్టీఫెన్‌సన్ ఇంటికెళ్లి రూ.50లక్షలు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో కొన్ని నెలల పాటు చంచల్ గూడ జైల్లో రేవంత్ శిక్ష అనుభవించారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.