close
Choose your channels

Dharmapuri Srinivas:నిన్న జాయిన్.. ఇవాళ రిజైన్ : కాంగ్రెస్‌కు షాకిచ్చిన డీ శ్రీనివాస్, ఫ్యామిలీ గొడవలతోనేనా..?

Monday, March 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్‌కు మాజీ మంత్రి డీ శ్రీనివాస్ షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. తనను అనవసర వివాదాల్లోకి లాగొద్దంటూ డీఎస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. ‘‘ ఈ నెల 26వ తేదీన నా కుమారుడు డి.సంజయ్ కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా , ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్‌కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు , ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వున్న తనను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి , ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను ’’ అంటూ డీ శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.

ఆయనను ప్రశాంతంగా బతకనీయండి :

అలాగే ఆయన భార్య విజయలక్ష్మీ కూడా విడిగా మరో లేఖను విడుదల చేశారు. ‘‘ఇగో డీఎస్ గారి రాజీనామా.. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి , మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్నా.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో , అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి ’’ అంటూ విజయలక్ష్మీ కోరారు.

ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌లో వైఎస్ తర్వాత నెంబర్ 2 గా డీఎస్:

కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌లో డీ.శ్రీనివాస్ బలమైన నేత. అప్పటి పార్టీలో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా ఆయన చక్రం తిప్పారు. డీఎస్-వైఎస్ జోడీ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రెండు సార్లు అధ్యక్షుడిగా, మంత్రిగా సేవలందించారు. అయితే వైఎస్ మరణం, రాష్ట్ర విభజనతో డీఎస్ ప్రాభవం తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2015లో బీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

బీఆర్ఎస్‌లో డీఎస్‌కు దక్కని ప్రాధాన్యత:

బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత అక్కడ ఆయన ఇమడలేకపోయారు. దీనికి తోడు డీఎస్ కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె, కవితపైనే పోటీ చేసి గెలిచారు. దీనికి తోడు నిత్యం కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలపై అర్వింద్ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో డీ శ్రీనివాస్‌కు ప్రాధాన్యత లభించడం లేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈలోపు రాజ్యసభ పదవీ కాలం కూడా పూర్తి కావడంతో డీ శ్రీనివాస్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయిన డీఎస్ తన ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తదితర పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో డీ శ్రీనివాస్ చేరిక తెలంగాణ కాంగ్రెస్‌కు శుభపరిణామమనే చెబుతున్నారు నిపుణులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.