close
Choose your channels

Rashmika:రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఏమన్నారంటే..?

Tuesday, November 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. రష్మికకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, హీరోలు అక్కినేని నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, ప్రియా ప్రకాష్ వారియర్, సింగర్ చిన్మయి, స్పందించారు.

నాగచైతన్య స్పందిస్తూ “టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భాదితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు.

సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ "ఎంతో బాధగా, సిగ్గు చేటుగా అనిపిస్తోంది. ఇలాంటి గొప్ప అద్భుతమైన సాంకేతికతను ఇలా చెడుకు వాడటం, దాని వల్ల బాధితులు ఎంతగా నరకాన్ని అనుభవిస్తుంటారో అని తలుచుకుంటేనే బాధేస్తోంది.. దీని వల్ల భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి.. వెంటనే వీటిపై అవగాహన కల్పించి కొత్త చట్టాలు తీసుకురావాలి" అని డిమాండ్ చేశారు.

మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ.. "ఇలాంటి పనులు చేసే వారిని తలుచుకుంటే సిగ్గేస్తోంది.. అలాంటి వారిలో కొంచెం కూడా మంచితనం లేదనిపిస్తోంది.. ఇలాంటి విషయాల మీద నోరు విప్పి మాట్లాడినందుకు, సమస్యను అందరి ముందుకు తీసుకొచ్చి రష్మికకు థాంక్స్.. ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతారు.. హీరోయిన్ల ఫోటోలు ఎక్కువగా మార్పింగ్ చేస్తారు.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు.. అమ్మాయి శరీరాన్ని ఇష్టమొచ్చినట్టుగా మార్ఫ్ చేస్తుంటారు.. ఈ సమాజం ఎటు పోతోంది.. సెలెబ్రిటీలమైన పాపానికి మీరు ఇలా చేస్తారా? అందరూ నోరు విప్పండి.. ప్రశ్నించండి" అని నిలదీసింది.

సింగర్ చిన్మయి స్పందిస్తూ "ఇలాంటివి చాలా ప్రమాదకరమని.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్‌ వీడియోలను అరికట్టాలి"అని కోరారు.

ఇక ఈ వీడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఆన్‌లైన్‌లో ఎవరివైనా వీడియోలు మ్యానిప్యులేట్‌ చేయడం ఎంత సులభమో ఈ ఘటన తెలియజేస్తోంది. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు అవసరం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రాజీవ్ చంద్రశేఖర్‌ ఈ ఘటనపై స్పందించి సమగ్ర చర్యల కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

ప్రముఖల స్పందనపై రష్మిక స్పందిస్తూ తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.