close
Choose your channels

Nominations:తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కీలక నేతల నామినేషన్లు

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు.. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈనెల 25వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26న వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తదుపరి మే 13న పోలింగ్ నిర్వహించి.. జూన్‌ 4న ఫలితాలు ప్రకటిస్తారు. దీంతో తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నాయకులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రాజకుమారికి సమర్పించారు. ఇక ఒంగోలు లోక్ సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ వేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌తో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కలెక్టర్ దినేష్ కుమార్‌కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈనెల 25న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి నామినేషన్లు వేశారు. అలాగే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక.. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున ఆయన తల్లి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

అటు తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. ఇక మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మొదటి సెట్ నామినేషన్ వేశారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరఫున కాంగ్రెస్ నాయకులు మొదటి సెట్ నామినేషన్ వేశారు. ఈ నెల 24న సురేష్ షెట్కార్ రెండో సెట్ నామినేషన్ సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజే నామినేషన్ల సందడి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.