close
Choose your channels

'ఇట్లు అమ్మ' టైటిల్ లోగో లాంఛ్

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇట్లు అమ్మ టైటిల్ లోగో లాంఛ్

అంకురం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ఇట్లు అమ్మ. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని ఇట్లు అమ్మ చిత్రం ఇవ్వబోతోంది. మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిస్తుందీ సినిమా. ఈ సందేశాత్మక చిత్రాన్ని బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించారు. నాగులపల్లి కనకదుర్గ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు దేవి, విమల వంటి పలువురు వుమెన్ ఆక్టివిస్టులు పాల్గొన్నారు.

లోగోను ఆవిష్కరించిన అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అంకురం సినిమా చూసి ఆ దర్శకుడు ఎలా ఉంటారో చూడాలని అనుకున్నాను. నేను అలా అనుకున్న మరో దర్శకుడు బాలచందర్. అంకురం సిినిమా నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. నాకు ఉమామహేశ్వరరావు గారంటే గౌరవం. ఆయన పిలిస్తే కాదనలేను. కొంతమంది మాత్రమే ఆయనలా సమాజం కోసం కథలు రాసి సినిమాలు రూపొందిస్తుంటారు. సమాజం బాగుండాలని, వ్యవస్థలతో పోరాడుతుంటారు. నిర్దుష్టమైన మారని ఒకే అభిప్రాయాలతో ఉంటారు. నిర్మాత బొమ్మక్ మురళి ఒక అంకితభావంతో ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన నాగులపల్లి కనకదుర్గ గారిని మా సంస్థలో చేరమని కోరుతున్నా. మీరు అనుకున్న ప్రభావం సమాజం మీద మీ సినిమా చూపించాలని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రపంచంలో జరిగే హింస, బేధాల వల్ల ఎక్కువ బాధకు గురయ్యేది అయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. ప్రపంచ గతిని మార్చేశక్తి స్త్రీలకు ఉంది అనేది మా నమ్మకం. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం. ఇందుకు తల్లులందురూ ఏకమవ్వాలి అని చెప్పేందుకు ఈ చిత్రాన్ని రూపొందించాం. మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. పురోగతి చెందే సమాజంలో మహిళ ప్రధాన భాగం కావాలని కథలో చూపిస్తున్నాం. వాస్తవికమైన దృశ్యాల ద్వారా, నిజమైన జీవితాలను, భావాలను చెబితే అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలా చెప్పేందుకు సహజమైన భావోద్వేగాలు చూపించే నటి కావాలి. ఆ సమర్థత ఉన్న నటి రేవతి. అన్నారు.

నిర్మాత బొమ్మక్ మురళి మాట్లాడుతూ... రాజ్యాంగ రచనకు ముందు స్త్రీ పాత్ర ఇంటికే పరిమితం అయ్యింది. రాజ్యాంగం రచించాక ఆమె సమాజంలోకి అడుగుపెట్టింది. స్త్రీ బాగుంటే దేశం బాగుంటుంది. మరికొన్ని చట్టాలు అమలుకు వస్తే రాజకీయ రంగంలో స్త్రీ భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. ఇట్లు అమ్మతో ఓ మంచి చిత్రాన్ని నిర్మించాలనే నా కల నెరవేరింది. ఈ చిత్రంలో ఉమామహేశ్వరరావు గారు, సినిమాటోగ్రాఫర్ మధు అంబట్ వంటి గొప్ప వ్యక్తులతో పనిచేయడం సంతోషంగా ఉంది. కథ విన్నాక మాకు గుర్తొచ్చిన ఒకే ఒక నటి రేవతి గారు. ఆమె లేకుంటే ఈ సినిమా నిర్మించేవాళ్లం కాదు. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

ఇట్లు అమ్మ టైటిల్ లోగో లాంఛ్

రేవతి మాట్లాడుతూ... ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. మధ్య వయస్సులోనూ తాను నేర్చుకోవాల్సింది ఉంటుందని, మార్పు తీసుకురాగలదని చెప్పే అరుదైన కథ ఇది. దర్శకుడు ఎంతో అద్భుతంగా రాశారీ కథ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న రాత్రి అనే వాక్యంతో కథ మొదలువుతుంది. ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరించేందుకు దర్శకుడు 12 రాత్రులు తీసుకున్నారు. అంటే జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు సినిమాను రూపొందించారు. నిర్మాత బొమ్మక్ మురళి, కనకదుర్గ ఒక మంచి సినిమా చేయాలని కలగన్నారు. మీ ప్రయత్నాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. ఇట్లు అమ్మ సందేశాలు ఇవ్వదు. గొంతెత్తి కేకలు వేయదు. మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. అని చెప్పారు.

సినిమాటోగ్రాఫర్ మధు అంబట్ మాట్లాడుతూ.. సి ఉమామహేశ్వరరావుతో నాలుగు దశాబ్దాలపైగా మితృత్వం నాది. రేవతిని ఆశా అని పిలుస్తుంటాను. ఆమె ఈ కథలో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగులపల్లి కనకదుర్గ మాట్లాడుతూ... మహిళ అభ్యున్నతి కోరే అనేక మంది వుమెన్ ఆక్టివిస్టులు అండగా ఉండటం మా బలం. స్త్రీ శక్తికి నిదర్శనంగా ఇట్లు అమ్మ సినిమా ఉంటుంది. అన్నారు.

మధుమిత, రవికాలె, పోసాని, కృష్ణేశ్వర్ రావు, అరువీ బాల, ప్రశాంత్, వినీత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - మధు అంబట్, సంగీతం - సన్నీ ఎంఆర్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, పాటలు - గోరటి వెంకన్న, రామ్, ఇండస్ మార్టిన్, కాస్ట్యూమ్ - సరితా మాధవన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.