close
Choose your channels

Pemmasani:అమరావతికి ఇంత ద్రోహం చేసిన జగన్‌కు బుద్ధి చెప్పాలి: పెమ్మసాని

Friday, April 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజాధనాన్ని దోచుకుంటున్న నాయకులు, అధికారులను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర మండల కేంద్రంలో గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కొల్లిపర శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రచారయాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగింది. వీధివీధినా కొనసాగిన ప్రచార రథానికి స్థానికులు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టి నాయకులకు స్వాగతం పలుకగా, అభిమానులు, కార్యకర్తలు పలు కూడళ్ల వద్ద గజమాలలు వేసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పట్టిసీమను నిర్వహించే సామర్థ్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతంలోనూ అందుబాటులో ఉందని.. అయితే డ్రిప్ ఇరిగేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఈ ప్రభుత్వం అందించలేకపోవడంతో ఆ పథకం కూడా మూలన పడిందని మండిపడ్డారు. ఇసుక మాఫియా తవ్విన గోతుల వల్ల కొల్లిపర పరిసర ప్రాంతాల్లోని 38 మంది గడిచిన ఐదేళ్లలో ప్రాణాలు వదిలారని వాపోయారు. అటు ప్రకృతి పరంగా ఇటు ప్రాణాల పరంగా భారీ నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మన ప్రాంతంలో ఇసుక, మైనింగ్, గ్రావెల్ అన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని.. ఈ అవినీతి సొమ్మంతా నాయకులే తింటున్నారా? లేదా పెద్ద తలలకు అందిస్తున్నారా? అని ప్రశ్నించారు.

ప్రజాధనాన్ని కొందరు అధికారులు, నాయకులు ఇలా దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడానికి ఓ పవన్ కళ్యాణ్, ఒక పెమ్మసాని రాకూడదా? అని తెలిపారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను అందించగా, అందులో 20వేల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు అందించారన్నారు. కానీ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే భూములు ఇచ్చారంటూ జగన్ ప్రభుత్వం కుట్ర ప్రచారం చేసిందన్నారు. చంద్రబాబుపై వ్యక్తిపై కక్షతో వేలాది, లక్షలాదిమంది ప్రజలకు చెందాల్సిన భూములను, ఆస్తులను, భవనాలను నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని అమరావతికి ఇంత ద్రోహం చేసిన నాయకులను ఇంకా నమ్మాలా! వద్దా! అని ప్రజలే నిర్ణయించుకోవాలని పెమ్మసాని వెల్లడించారు.

అనంతరం కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే రోడ్లు, సంక్షేమ పథకాలు, రైతులకు కావలసిన అవసరాలు తీర్చడంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. పాలన చేతకాక జగన్ అడ్డదారుల్లో ముందుకు సాగారని.. ప్రశ్నించిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులను వేధించారని పేర్కొన్నారు. ఈ నెల రోజులు గట్టిగా పనిచేసి ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడదామని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇల్లు పేరు చెప్పి, పథకాల పేరు చెప్పి ప్రజలను మోసగించి దోచుకున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని మీ ఓటు హక్కుతో తరిమికొట్టండన్నారు. కూటమి బలపరిచిన గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్, అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ సమావేశంలో నాయకులు పాల్గొని వ్యాపారుల సమస్యలపై స్పందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.